Jul 24 2025 9:59 AM | Updated on Jul 24 2025 6:51 PM
దక్షిణ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలకు నిలయం. వీటి అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక మహత్తు అద్భుతం. అందుకే ఈ దేవాలయాల్లో చాలా వరకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. రాతి శిల్పాలు, సంగీత స్తంభాలు, రథాకార నిర్మాణాలు ఈ ఆలయాలకు ఒక ప్రత్యేకతను, గుర్తింపునూ తీసుకువచ్చాయి. ప్రతి దేవాలయం ఒక అపురూప కట్టడం. అంతేకాదు, ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది. ఇటీవలే యునె
దక్షిణ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలకు నిలయం. వీటి అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక మహత్తు అద్భుతం. అందుకే ఈ దేవాలయాల్లో చాలా వరకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. రాతి శిల్పాలు, సంగీత స్తంభాలు, రథాకార నిర్మాణాలు ఈ ఆలయాలకు ఒక ప్రత్యేకతను, గుర్తింపునూ తీసుకువచ్చాయి. ప్రతి దేవాలయం ఒక అపురూప కట్టడం. అంతేకాదు, ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది. ఇటీవలే యునెస్కో తాజాగా మరో ఏడు ఆలయాలకు వారసత్వ గుర్తింపును ఇచ్చింది. అవేమిటో చూద్దాం..
1. కడలేకల్ గణేశాలయం – హంపి బాల గణేశుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో ముద్దుగా కూర్చుని, చిట్టి చేతులను ఆ జగదంబ వీపుమీద వేసినట్లుగా ఉన్న ఈ విగ్రహం చూడగానే ఆహా అనిపిస్తుంది. హంపీలోని ప్రముఖ శిల్పాలలో ఒకటైన కడలేకల్ గణేశ విగ్రహం ఏకశిల నుంచి చెక్కబడింది.
విజయనగర సామ్రాజ్య శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం వినాయకుడి భక్తులకు ఎంతో ప్రీతికరమైనది. ‘కడలేకల్‘ అనే పేరు గణేశుడి పొట్టను పోలి ఉండటం వల్ల వచ్చింది.
2. బృహదీశ్వరాలయం – తంజావూరు రాజరాజ చోళుడు 1010లో నిర్మించిన ఈ అద్భుత ఆలయం, శివుని వాహనమైన నందితో సహా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని రాతి శిల్పాలు అబ్బురపరుస్తాయి. ప్రతి రోజు రాత్రి జరిగే పూజ ప్రత్యేక ఆకర్షణ. పూజారులు వేద మంత్రాలతో బృహదీశ్వరునికి పవిత్ర జలాలు, పాలతో అభిషేకం చేస్తారు. పల్లకీలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అందంగా మార్చుతుంది.
3. ఐరావతేశ్వరాలయం – దారాసుర రథాకార శిల్పాలకు పెట్టిన పేరైన ఈ ఆలయం సురపతి అయిన ఇంద్రుడి వాహనం శ్వేత మత్తేభం ఐరావతం పేరు మీదుగా ప్రసిద్ధికెక్కింది. గోడలపై పురాణాలు చెక్కబడి ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణ – సంగీత మెట్లు. ఏడు మెట్లు, ఏడు సంగీత స్వరాలను సూచిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయంలోని సూర్య పుష్కరణి అనే పవిత్ర పుష్కరిణిలో ముందుగా స్నానం చేసి ఆ తర్వాత స్వామిని సందర్శించటం ఆనవాయితీ.
4. మహిషాసురమర్ధిని మండపం మహాబలిపురం పల్లవ రాజవంశం నిర్మించిన ఈ రాతి శిల్పాల ఆలయం, మహిషాసురుడు, దుర్గాదేవి మధ్య యుద్ధాన్ని చూపించే అద్భుత దారుశిల్పాలతో ప్రసిద్ధికెక్కింది. అంతేకాక, శ్రీ మహా విష్ణువు తన పానుపైన ఏడు తలల ఆదిశేషునిపైన విశ్రాంతి తీసుకుంటున్న శిల్పం చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.
5. షోర్ టెంపుల్, మహాబలిపురం మహాబలిపురం పల్లవ రాజు 11వ నరసింహవర్మ 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఒకప్పుడు ఏడు దేవాలయాల సమూహంలో భాగం. వరద ముంపులో మిగతా ఆలయాలన్నీ నీట మునిగి΄ోయినా, ఇది మాత్రమే నిలిచి ఉంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి పండుగలకు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
6. విరూపాక్షాలయం – హంపి హంపి మధ్యలో ఉన్న ఈ ఆలయం మహా శివునికి అంకితం చేయబడింది. పంప అనే బ్రహ్మ కుమార్తె ఇక్కడ తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుందనే కథనం దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెచ్చింది. ఇక్కడ పంచామృత అభిషేకం, పూల అలంకారం, పూజారుల వృత్తాకార ఊరేగింపులు ముఖ్య విశేషాలు.
7. విఠలాలయం – హంపి ఈ ఆలయం సంగీత స్తంభాలు (మొత్తం 56) కు ప్రసిద్ధి. స్తంభాలను మీటితే వినసొంపైన స్వరాలు వినిపిస్తాయి. విష్ణువు అవతారమైన విఠలేశ్వరుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాదు, గొప్ప కళాత్మకతకు కూడా నిదర్శనంగా నిలుస్తుంది.