కంప్యూటర్‌ సైన్స్‌ వదిలేసి 'జెప్టో' స్టార్టప్‌.. యంగెస్ట్‌ మిలీయనీర్స్‌గా | Sakshi
Sakshi News home page

'జెప్టో’ స్టార్టప్‌తో తిరుగులేని విజయం.. ఇ–కామర్స్‌లో నెంబర్‌1గా సంచలనం

Published Fri, Sep 29 2023 11:30 AM

Aadit Palicha And Kaivalya Vohra Founders Of Zepto Sucess Story - Sakshi

బెంగళూరుకు చెందిన కైవల్య వోహ్ర, ముంబైకి చెందిన అదిత్‌ పలీచా స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీ(యూఎస్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీని మధ్యలోనే వదిలేసి ‘ఏదైనా సాధించాలి’ అనే లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు. ‘జెప్టో’ స్టార్టప్‌తో తిరుగులేని విజయాన్ని సాధించారు.

తాజాగా లింక్డిన్‌ ‘టాప్‌ 25 స్టార్టప్‌’ల జాబితాలో ఇ–కామర్స్‌ గ్రాసరీ ΄ప్లాట్‌ఫామ్‌ ‘జెప్టో’ మొదటి స్థానంలో నిలిచింది. చిన్న వయసులోనే తమ స్టార్టప్‌ ‘జెప్టో’ను యూనికార్న్‌ స్టేటస్‌కు తీసుకెళ్లిన కైవల్య వోహ్రా, అదిత్‌ పలీచాలు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు...


లాక్‌డౌన్‌ సమయంలో తమకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటే బహుశా ‘జెప్టో’ స్టార్టప్‌ పుట్టేది కాదేమో. ఆ సమయంలో ముంబైలోని అద్దె ఇంట్లో ఉంటున్న కైవల్య వోహ్ర, అదిత్‌ పలీచాలు నిత్యావసర వస్తువులకు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్లో నుంచే ‘కిరాణామార్ట్‌’ స్టార్టప్‌ పుట్టింది. ఇదే ఆ తరువాత ‘జెప్టో’ రూపంలో విశ్వరూపాన్ని చూపించింది. తిరుగు లేని విజయాలు సాధించడానికి వయసు అడ్డు కాదని, అనుభవం అత్యవసరం కానక్కర్లేదని, కృషి పట్టుదల ఉంటే సరిపోతుందని ‘జెప్టో’ అసాధారణ విజయం నిరూపించింది. ఆరోజుల్లోకి వెళితే...‘మాకు సవాలు విసిరిన టైమ్‌ అది. నిజానికి కిరాణాషాప్‌ల గురించి మాకు అంతగా తెలియదు. క్రాష్‌ కోర్సులు కాలేజీల్లోనే కాదు వాటికి అవతల కూడా ఉంటాయి!

రోజూ పొద్దున్నే పది నుంచి ఇరవై కిరాణాషాప్‌లకు వెళ్లి యజమానులతో వివరంగా మాట్లాడి మా కాన్సెప్ట్‌ చెప్పేవాళ్లం. పిల్లలేదో చెబుతున్నారు...విందాం...అన్నట్లుగా వినేవారు తప్ప మాపై వారికి అంతగా నమ్మకం ఉన్నట్లుగా అనిపించేది కాదు. మా యాప్‌ను కొద్దిమంది మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అంగీకరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు కైవల్య వోహ్ర.పరిస్థితులను చూస్తుంటే...‘అబ్బే ఇదేదో మనకు వర్కవుట్‌ అయ్యేట్లు లేదు. మిత్రమా...రథం వెనుక్కు మళ్లించు’ అనుకునే పరిస్థితి. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ‘సక్సెస్‌ మంత్రా’లో ఒక రూల్‌....యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించకు. రణస్థలి వరకు మాత్రమే వెళ్లారు. ఇంకా యుద్ధం మొదలే కాలేదు.వారి కృషి ఫలితంగా మెల్లగా యాప్‌ ఊపందుకుంది.

‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబ్బై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణాదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. వస్తువులను డెలివరీ చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే!  ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి.ఇప్పుడు...‘జెప్టో’ మన దేశంలోని ప్రధాన నగరాలలో మూడు వేలకు పైగా గ్రాసరీ ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేస్తుంది. గంటలు దాటని, కస్టమర్‌ ఓపికను పరీక్షించని అతి తక్కువ సమయ డెలివరీ టైమ్‌ను నిర్దేశించుకుంది. ఇద్దరితో మొదలైన ‘జెప్టో’లో ఇప్పుడు వెయ్యిమంది ఉద్యోగులు ఉన్నారు.

‘జెప్టో’ సక్సెస్‌లో ‘యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌’ కీలక భూమిక పోషించింది, ‘విజయానికి త్యాగానికి సంబంధం ఉందా?’ అని అడిగితే ‘కచ్చితంగా ఉంది’ అంటాడు కైవల్య వోహ్ర.
‘ఏ వయసు ముచ్చట ఆ వయసులో’ అంటారు. ఆడి పాడాల్సిన రోజుల్లో, సినిమాలు, షికార్లు, స్నేహితులే ప్రధానమనిపించే రోజుల్లో అన్నీ విడిచిపెట్టి ‘మా స్టార్టపే మా ప్రపంచం’ అన్నట్లుగా పగలు,రాత్రి కష్టపడ్డారు.‘మనం ఒక రంగంలో విజయం సాధించాలంటే మన ఇష్టాలకు దూరంగా ఉండక తప్పదు. దీన్ని త్యాగం అనుకోవచ్చు’ అంటాడు కైవల్య వోహ్ర. మన దేశ గ్రాసరీ సెగ్మెంట్‌లో తమదైన ముద్ర వేసిన కైవల్య వోహ్ర, అదిత్‌ పలీచాలు ‘యంగెస్ట్‌ సెల్ఫ్‌–మేడ్‌ మిలీయనీర్స్‌’గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.

                                 ∙ 

‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. వస్తువులను డెలివరి చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే!  ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి.
 

Advertisement
Advertisement