మహేశ్‌బాబు, ప్రభాస్‌ నన్ను ప్రేమిస్తున్నారు..! | 35Years Woman Mental health issue | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు, ప్రభాస్‌ నుంచి క్రికెటర్ల వరకు.. అందరూ నన్నే ప్రేమిస్తున్నారు!

Nov 5 2026 9:15 AM | Updated on Nov 5 2026 9:16 AM

35Years Woman Mental health issue

మా చెల్లెలి వయసు 35 ఏళ్లు. మా కుటుంబ పరిస్థితుల వల్ల ఆమెకు వివాహం చేయలేకపోయాము. ఈ మధ్య గత సంవత్సరం నుంచి సమాజంలో పెద్ద హోదాలో, గొప్ప స్థానంలో ఉన్నవారు, సెలబ్రెటీలు, సినిమా హీరోలు తనను ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనీ అంటోంది. వాళ్లందరూ తనకు రోజూ మెసేజ్‌లు పెడ్తున్నారని, లవ్‌ సింబల్స్‌ పెడ్తున్నారని అంటుంది. హీరోలు మహేష్‌ బాబు, ప్రభాస్, కొందరు క్రికెట్‌ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తనను ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటున్నారని చెబుతోంది. రోజంతా తన పెళ్లి గురించి, ప్రేమించే ప్రముఖ వ్యక్తుల గురించి తప్ప ఇతరత్రా ఏమీ మాట్లాడటం లేదు. ఈ విషయం తప్ప మిగతా ప్రవర్తన  అంతా బాగానే ఉంటుంది. మాకేం చేయాలో అర్థం కావడం లేదు.  మీరు మాకేదైనా మంచి సలహా ఇస్తారని  ఆశిస్తున్నాను
 – వెంకటేష్, నిజామాబాద్‌

ఇది చాలా అరుదైన మానసిక సమస్య. ఎలాంటి వాస్తవం లేకపోయినా సమాజంలోని ప్రముఖ వ్యక్తులు తనను ప్రేమిస్తున్నట్లుగా చెప్పటం, ఇతరులు లాజికల్‌గా ఎంత కాదని చెప్పినా నమ్మకపోవటం ఈ సమస్య ముఖ్య లక్షణం. ఈ వింత మానసిక జాడ్యాన్ని ‘ఎరటోమేనియా’ లేదా ‘డిక్లెరామ్‌ బాల్ట్‌ సిండ్రోమ్‌’ అంటారు. వయసొచ్చినా, వివాహం కాలేని కొందరు, ఒంటరితనం, ఆత్మవిశ్వాసం లోపించడం, సామాజిక వెనుకబాటు లాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కొందరు ఈ విధమైన మానసిక వైపరీత్యానికి లోనయే అవకాశం ఉంది. 

మెదడులోని ‘న్యూరో  ట్రాన్స్‌  మిట్టర్స్‌’ అనే రసాయనిక పదార్థాల సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు ఈ మానసిక రుగ్మత బయటపడుతుంది. తమలోని ఆత్మన్యూనత లోంచి బయటపడేందుకు తమ మనసును సమాధానపరుచుకునేందుకు  కొందరిలా పవర్తించే అవకాశముంది. మాటలతోను, లాజికల్‌ గాను వీరిని మార్చటం అసంభవం! మానసిక వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం మందులు, కౌన్సెలింగ్‌ చేయిస్తే వారిలోని ఇలాంటి వింత ఆలోచనలు తగ్గి ఊహలోకం నుండి వాస్తవ లోకంలోకి వస్తారు. మీరు వెంటనే మీ చెల్లెలిని దగ్గరలోని సైకియాట్రిస్టుకు చూపించి తగిన వైద్యం చేయించండి, అన్నీ చక్కబడతాయి  
ఆల్‌ ది బెస్ట్‌ !  

ఇదీ చదవండి: పోతపాలు అతిమధురం..అమ్మపాలే అమృతం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement