
వరుస ఓటములు కొందరిని కుంగదీసి ఏమి చేయలేని స్థితికి చేరుస్తాయి. కొందరికి అవి మరింతగా బలంగా పుంజుకోవడానికి దోహదపడి..ఎవ్వరూ ఊహించనంత స్థాయికి చేరుస్తాయి. గెలవాలన్న దృఢ సంకల్పం, వెనక్కి తగ్గని పట్టుదల ఉన్నవారే ఫెయిల్ అనే పదానికి సరైన అర్థం ఇచ్చేలా గెలిచి చూపిస్తారు. అలాంటి ఘనతనే సాధించింది ఈ కర్ణాటక అమ్మాయి. అంతేగాదు చిన్న వయసులోనే యూకే ఆధారిత విమానాయన దిగ్గజం రోల్స్ రాయిస్‌లో భారీ వేతనంతో పనిచేసే అవకాశాన్ని అందుకుని శెభాష్ అనిపించుకుంది.
కర్ణాటకలోని తీర్థహళ్లి తాలూకాలోని కోడూరుకి చెంఇన రీతూపర్ణ సెయింట్ ఆగ్నెస్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నీట్ ద్వారా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనుకుంది. అందులో విఫలమవ్వడంతో తీవ్రంగా నిరుత్సాహపడింది. డాక్టర్ కావాలన్నది ఆమె కల..కానీ అది చూస్తుండగానే ఆవిరైపోయింది. సరిగ్గా ఆ సమయంలో రీతూపర్ణ తండ్రి ఆమెను ఇంజనీరింగ్ వైపుకి వెళ్లమని సూచించారు.
అలా ఆమె 2022లో మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (SCEM)లో సెట్ ద్వార్ అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యింది. కాలేజ్ మొదటి రోజు నుంచే శ్రద్ధగా చదవడం మొదలు పెట్టింది. అలా ఆమె ఆటోమేషన్ పట్ల ఆకర్షితురాలై రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లింది. తన సీనియర్ విద్యార్థుల నుంచి ప్రేరణ పొంది..ప్రభావవంతమైన ప్రాజెక్టులను రూపొందించడం ప్రారంభించింది.
రోబోలు నిర్మించడం..పతకాలు గెలుపొందడం..
తన బృందంతో కలిసి రితుపర్ణ వక్క రైతుల కోసం రోబోటక్ స్ప్రేయర్ హార్వెస్టర్‌ని నిర్మించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఇనెక్స్‌లో జరిగిన పోటీలో ఈ రోబోలిక్ స్ప్రేయర్ బంగారం, వెండి పతకాలను గెలుచుకుంది. ఆ పరిజ్ఞానమే తనకు నిట్‌కే సూరత్కల్‌లో రోబోటిక్ సర్జరీపై పరిశోధన చేసేందుకు దోహదపడింది. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ ములై ముహిలన్ ఎంపీతో నేరుగా సంభాషించి, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం మొబైల్ యాప్‌ని డెవలప్ చేయడంలో సహాయపడింది.
మంచి గుర్తింపు కోసం..
తన పరిజ్ఞానంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో రీతూపర్ణ ఇంటర్న్‌షిప్ కోసం రోల్స్ రాయిస్‌ను సంప్రదించింది. కంపెనీ ప్రారంభంలోనే ఆమె అవకాశాలను తోసిపుచ్చింది. అలా ఒక నెలలో కేటాయించిన పనిని కూడా పూర్తి చేయలేకపోయింది రీతూపర్ణ. దాంతో ఒక్క ఛాన్స్ అంటూ ఒక్క నెల గడువుతో పూర్తి చేసే మరో సవాలుని తీసుకోవాల్సి వచ్చింది.
అయితే దానిని ఆమె కేవలం ఒక వారంలోనే పూర్తి చేసింది. రీతూ సామర్థ్యం చూసి ఇంప్రెస్ అయిన రోల్స్ రాయిస్ మరో అసైన్‌మెంట్ ఇచ్చింది. అలా ఎనిమిది నెలలు కష్టతరమైన ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలతో గడిచిపోయింది. చెప్పాలంటే తన ఆరవ సెమిస్టర్‌లో కాలేజ్‌కి డుమ్మా కొట్టి మరీ యూకే వర్క్‌షిప్ట్స్‌లో పనిచేసింది. అలా డిసెంబర్ 2024 నాటికి 39.6 లక్ష ప్రీ ప్లేసమెంట్ ఆఫర్ అందుకుంది. ఇక ఏప్రిల్ 2025 నాటికి తన పనితీరుతో రూ. 72.3 లక్షలకు వేతన ఆఫర్‌ని అందుకుంది.
అమెరికాకు వెళ్లనుంది..
రీతూపర్ణ తన ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తదనంతరమే రోల్స్ రాయిస్‌లో పూర్తి సమయం పనిచేసేందుకు యూఎస్‌ఏలోని టెక్సాస్‌కు వెళ్లనుంది. అక్కడ ఆమె జెట్ ఇంజిన్ తయారీ యూనిట్‌లో పనిచేయనుంది. ఆమె ఈ కంపెనీలోకి ప్రాబ్లం సొల్యూషన్ అనే ప్రతిష్టాత్మక డీసీ ఫెలోషిఫ్ ప్రోగామ్ ద్వారా ఎంపికైంది. ఆమె తోపాటు కన్నడ నుంచి సుమారు 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
కాగా ఆమె డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ లారెన్స్ జోసెఫ్ ఫెర్నాండెజ్ రీతూపర్ణ విజయాన్ని కళాశాలకు గర్వకారణమైన క్షణంగా అభివర్ణించడమే గాక ఔత్సాహిక యువ ఇంజనీర్లకు ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. చివరగా రీతూపర్ణ మాట్లాడుతూ.."ఇటీవల యువత చాలా పెద్ద కలలు కంటున్నారు గానీ 50% మాత్రమే ఔట్‌పుట్ ఇస్తున్నారు. కానీ విజయం సాధించాలంటే 200% ఔట్‌పుట్ ఇవ్వాలి. దృఢ సంకల్పంతో ఉంటూ మూలాల్ని మర్చిపోకూడదు. అప్పుడే గెలుపు తీరాన్ని అందుకోగలమని చెబుతోంది." రీతూపర్ణ.