
గతంలో ఎన్నో గాంధీజీకి సంబంధించిన వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికి ఆ మహాత్ముడి ఔన్యత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. ఆ విశిష్ట వ్యక్తి ఎప్పటికీ అపురూపమే, ఆయనకు సంబంధించినది ఏదైనా..వెల కట్ట లేనంత గొప్పది అని చెప్పకనే చెబుతున్న ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరోకటి చోటుచేసుకుంది. గొప్ప గొప్ప కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఆయన చిత్రాలను ఎన్నో చూశాం. కానీ ఈ పెయింటింగ్ మాత్రం అన్నింటికంటే ప్రత్యేకమైనది. పైగా వేలంలో ఎంత పలికిందో వింటే విస్తుపోతారు.
బ్రిటిష్ కళాకారిని క్లేర్ లైటన్ మహాత్మా గాంధీ ఆయిల్ పెయింటింగ్ రూపొందించారు. ఈ పెయింటింగ్ దాదాపు మూడు సార్లు రూ. 58 లక్షల నుంచి 81 లక్షలకు అమ్ముడైంది. పైగా ఇది ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆన్‌లైన్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడైన పోర్ట్రెయిట్‌గా పేరుగాంచింది. 1989లో ఆమె మరణించేంత వరకు ఈ చిత్రపటం ఆమె పేయింటింగ్ కలెక్షన్‌లలోనే ఉంది.
ఆ తర్వాత ఆమె కుటుంబం ద్వారా ఇది అమ్మకానికి వచ్చిందట. తొలిసారిగా 1974లో గ్యాలరీ ప్రదర్శనలో ఉంచినప్పుడు..ఒక అపరిచిత వ్యక్తి ఈ చిత్రపటంపై కత్తితో దాడి చేశారట. అతడు ఒక హిందూ మితవాద తీవ్రవాదిగా ఆ కళాకారిణి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ పెయింటింగ్ ప్రత్యేకత..
గాంధీజిని ప్రత్యక్ష్యంగా చూస్తూ.. గీసిన ఆయిల్ పెయింటింగ్ ఇది. 1931లో లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైనప్పుడు బ్రిటిష్-అమెరికన్ కళాకారిణి క్లేర్ లైటన్ రూపొందించారట. ఆమెకు గాంధీజిని ఒక రాజకీయ జర్నలిస్ట్ హెన్రీ నోయెల్ బ్రెయిల్స్‌ఫోర్డ్ పరిచయం చేశారట. దాంతో లైటన్ లండన్ కార్యాలయానికి వచ్చి అనేక రోజులు ఉదయాన్నే గాంధీజీని చూస్తూ చిత్రించేవారట.
చెప్పాలంటే చాలా సందర్భాలలో గాంధీజీతో స్వయంగా కూర్చొని గీసే అరుదైన అవకాశ ఆ కళాకారిణి లైటన్‌కి లభించిందట. ఆ తర్వాత ఆ చిత్రాన్ని 1931 నవంబర్‌లో లండన్‌లోని సాక్‌విల్లే స్ట్రీట్‌లోని అల్బానీ గ్యాలరీస్‌లో ప్రదర్శించారట. ఆ ప్రదర్శనకు హాజరైన ఆమె స్నేహితురాలు జర్నలిస్ట్ వినిఫ్రెడ్ హోల్ట్‌బై ట్రేడ్ యూనియన్ ప్రచురణ 'ది స్కూల్‌మిస్ట్రెస్' పుస్తకంలో వివరించారు.
ఆ పెయింటింగ్ వెనుక భాగంలో గాంధీ వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ లేఖ కూడా ఉంటుందట. ఆయన అచ్చం గాంధీ మూర్తిత్వాన్నే దింపేలా గీశారంటూ అభినందించడమే గాక, గాంధీజీ కూడా అందుకు ధన్యావాదాలు పేర్కొన్నట్లు తెలిపారు లేఖలో. గాంధీ చిత్రపటం రూపొందించడానికి ప్రతి ఉదయం మాతో గడిపినందుకు చాలా సంతోషంగా ఉందని లేఖలో రాసుకొచ్చారు.
అలా ఎన్నో చిరస్మృతులకు నిలయమైన ఆ పెయింటింగ్ తమకు వారసత్వంగా వచ్చిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరణాంతవరకు ఆమె అధీనంలోనే ఉండేదని తెలిపారు. అంతేగాదు మహాత్మాగాంధీ కూర్చొని ఉన్న ఏకైక ఆయిల్ పెయింటింగ్ కూడా ఇదేనట.
ఇటీవల లండన్ బోన్‌హామ్స్ నిర్వహించిన వేలంలో ఆశ్చర్యకరంగా రూ.1.7 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. ఇది ఒకరకంగా సుదీర్ఘ ప్రాంతం ప్రజలతో గాంధీకి ఉన్న అత్యంత శక్తిమంతమైన సంబంధాన్ని తేటతెల్లం చేసింది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అపూర్వమైన ఘట్టమని వేలం నిర్వాహకులు పేర్కొనడం విశేషం.
(చదవండి: తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..)