రూ.1.9 కోట్ల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
భీమవరం: పట్టణంలోని నర్సయ్య అగ్రహారంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడి మహ్మద్ బాషాని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ బి. విశ్వనాథ్, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. నర్సయ్య అగ్రహారంలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్ ప్లాట్ నెం. 303లో నివాసం ఉంటున్న మహ్మద్ బాషా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శీలమంతుల కనకమహాలక్ష్మి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి బీరువాలోని సొత్తును అపహరించాడు. చోరీపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సహాయంతో అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే మహ్మద్ బాషాను నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం పట్టణంలోని జంక్షన్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి సుమారు రూ. 1.9 కోట్ల విలువైన 800 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు, రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పెనమలూరు: తాడిగడపలో అత్తింటికి వచ్చిన వ్యక్తి అదృశ్యమైన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా పెదపాడు గ్రామానికి చెందిన బెహరా కోటిరాజు (28) రెండు రోజుల క్రితం భార్య ఉషతో కలిసి తాడిగడప దళితవాడలో ఉన్న అత్తింటికి వచ్చాడు. అతను విజయవాడలోని ఓ ట్రాన్స్‌పోర్టులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే రోజు రాత్రి అతను ఆటోనగర్‌లో ట్రాన్స్‌పోర్టు యజమానిని కలవాలని ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కోటిరాజు కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికారు. అతని జాడ తెలియక పోవడంతో భార్య ఉష పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
భీమవరం : భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌పైగల కాలిబాట వంతెనపై జరిగిన లారీ ప్రమాదంలో పలువురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. భీమవరం పట్టణంలోని టూటౌన్ పోలీసుస్టేషన్ రోడ్డు వైపు నుంచి శనివారం ఒక లారీ గొల్లవానితిప్ప వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కాలిబాట వంతెన అప్రోచ్ రోడ్డు ఎక్కుతుండగా లారీకి ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ కావడంతో వెనుకకు జారింది. ఈ సమయంలో లారీ వెనుక వస్తున్న మోటార్ సైకిళ్లపైకి అది దూసుకురావడంతో.. నాలుగు బైక్‌లు లారీ కిందకు వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలవగా, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.


