ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వీయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు శనివారం రాత్రి నిత్య కల్యాణ మండపంలో జరిగిన ఎదుర్కోలు వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ వేడుకను శ్రీవారి కల్యాణానికి ముందురోజు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ముందుగా స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయం నుంచి తొళక్క వాహనంపై పడమర రాజగోపురం మీదుగా నిత్య కల్యాణ మండపం వద్దకు అట్టహాసంగా తీసుకెళ్లారు. అక్కడ విశేషంగా అలంకరించిన వెండి శేష వాహనంపై కల్యాణ మూర్తులను ఉంచి, హారతులిచ్చారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు శ్రీవారి గుణగణాలను, ఆయన విశిష్టతను, రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను కొనియాడారు. వివాహానికి ముందురోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఈ ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. ఉదయం హనుమద్వాహనంపై, రాత్రి వెండి శేషవాహనంపై జరిగిన శ్రీవారి తిరువీధి సేవలు భక్తులకు నేత్రపర్వమయ్యాయి. ఆలయ ముఖ మండపంలో శ్రీరామ పాదుకా సమేత భరతుడి అలంకారంలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో జరిగే శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు
● ఉదయం 7 గంటలకు – సింహ వాహనంపై తిరువీధి సేవ
● రాత్రి 8.30 గంటలకు– శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహన సేవ
● శ్రీవారి ప్రత్యేక అలంకారం – మోహిని
నేటిరాత్రి చినవెంకన్న తిరుకల్యాణం


