జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
కై కలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు గాంధీ ముచ్చటగా మూడుసార్లు విచ్చేశారు. ఆయన 1921 ఏప్రిల్ 3న భార్య కస్తూర్బాతో కలిసి ఏలూరుకు రైలు ద్వారా చేరుకున్నారు. మార్కండేయ గుడి సమీప అగ్రహారం వద్ద ఆంధ్ర మహా విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఓ మొక్కను నాటారు. ఏలూరు టౌన్‌హాల్‌లో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు దాదాపు 10,000 మంది మహిళలు హాజరయ్యారు. చేబ్రోలుకు చెందిన కాలగర్ర రవమ్మ అనే మహిళ గాంధీజీకి పది కాసుల బంగారు కడ్డీని తిలక్ స్వరాజ్య నిధికి విరాళంగా అందించింది.
రెండో బర్డోలీగా బిరుదు
మహాత్మాగాంధీ 1929 ఏప్రిల్ 25న ఆంధ్రా ప్రాంత పర్యాటనలో భాగంగా తాడేపల్లిగూడెంలో ప్రసంగించారు. ఖద్దరు ప్రచారం, నిధుల సేకరణ చేపట్టారు. చాగల్లులో ఆనంద నికేతన్, పోతునూరులో వివేకానంద గ్రంథాలయానికి శంకుస్థాపన చేసి, గుండుగొలను చేరుకున్నారు. అంటరానితనం నివారణకు, హరిజనోద్ధరణ కోసం గాంధీజీ దేశవ్యాప్తంగా చేపట్టిన హరిజన యాత్రలో భాగంగా 1933 డిసెంబరు 27న భీమవరం చేరుకున్నారు. కదం తొక్కిన భీమవరంలో ప్రజలను చూపి రెండో బర్డోలీగా గాంధీ అభివర్ణించారు. ఇక్కడ స్వాతంత్య్ర నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.
నెత్తురు మరిగి ఎత్తిన చేతులు
గాంధీజీ స్ఫూర్తితో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎందరో స్వాతంత్య్ర సమర నినాదాన్ని అందుకున్నారు. వీరిలో భూపతిరాజు వెంకటపతిరాజు(బీవీ రాజు), ప్రభల నరసింహాం, చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు, కల్లూరి సుబ్బారావు, పాలకో డేటి శ్యామలాంబ, సూర్యప్రకాశరావు దంపతులు, గారపాటి సత్యనారాయణ, మంగళంపల్లి చంద్రశేఖర్, వేటిరాజు సత్యనారాయణరాజు, అద్దాల రా ఘవరరాజు, షేక్ అలీ సాహెబ్, దాసరి కృష్ణవేణి, ద్రోణంరాజు లక్ష్మీబాయిమ్మ, మూల్పూరి చుక్కమ్మ, సర్దార్ దండు నారాయణరాజు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, కంతేటి కాశీవిశ్వనాథం, మాగంటి నాయుడమ్మ, ఉప్పాల కోదండరామయ్య, చిర్రవూరి అచ్చుతరామయ్య, పసల కృష్ణమూర్తి, మంగినపూడి పురషోత్తమశర్మలు తదితరులు ఉన్నారు.
మహాత్మా గాంధీ కేవలం ఒక వ్యక్తి కాదు.. అదొక అజేయమైన స్ఫూర్తి.. ఆ శక్తి ఏలూరు వీధుల్లో కాలేజీ రూపంలో ప్రాణం పోసుకుంది.. భీమవరం గడ్డపై బార్డోలి స్ఫూర్తిగా ఎగిసిపడింది.. కై కలూరు కొల్లేరు సరిహద్దుల్లోని ఇళ్లల్లో దీపమై వెలిగింది.. తాడేపల్లిగూడెంలో స్వాతంత్రోద్యమ తాండవం చేసింది.. నేడు 157వ గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
మహాత్ముడు నడయాడిన నేల
ఉమ్మడి జిల్లాకు మూడుసార్లు రాక
ఏలూరులో ఆంధ్ర జాతీయ మహావిద్యాలయానికి శంకుస్థాపన
తాడేపల్లిగూడెం, భీమవరంలో ఉత్తేజపూరిత ప్రసంగాలు
నేడు గాంధీజీ 157వ జయంతి
గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు, వివిధ కాలేజీల్లో గాంధీజీ జీవిత చరిత్రపై వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు, యువజన సర్వీసులు, మై భారత్ సంస్థల ఆధ్వర్యంలో సదస్సులు, పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలను నిషేధించేలా చర్యలు తీసుకున్నారు.


