పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే
గణపవరం: 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ సోదరులకు మరోసారి వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్‌ల పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామా బీసీలంతా గ్రహించారన్నారు. ఇప్పటికే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని చెప్పి వారిని నిలువునా మోసం చేసిన వెన్నుపోటు పార్టీ మరోసారి రిజర్వేషన్‌ల పేరుతో వంచించిందన్నారు. 34 శాతం రిజర్వేషన్‌లు చెల్లవని తెలిసే చంద్రబాబు ఈ అంశాన్ని స్థానిక ఎన్నికల ముందు తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టసవరణకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు నిజంగా అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీ మాత్రమే అని స్పష్టం చేశారు.


