అధికారుల కనుసన్నల్లోనే..!
భీమవరం: ఆక్వారంగంలో అక్రమ విద్యుత్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఒకవైపు సబ్సిడీ విద్యుత్ లేకుంటే సాగు చేయలేమంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే.. మరో వైపు అక్రమ విద్యుత్ వ్యాపారంతో ప్రతి నెలా లక్షలు సంపాదిస్తున్నారు కొందరు. ప్రధానంగా రొయ్యల సాగుకు విద్యుత్ ఎంతో అవసరం. రొయ్యలకు ఆక్సిజన్ అందకపోతే ఎదుగుదలలో ఇబ్బందులతోపాటు వ్యాధులు వ్యాపించి చనిపోతుంటాయి. దీనికిగాను రొయ్యల చెరువుల్లో సీడ్ వేసిన నాటి నుంచి విద్యుత్ ఏరియేటర్లు తిప్పుతుంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో విద్యుత్ ఏరి యేటర్స్ తిప్పడం పరిపాటి.
అధికారిక కనెక్షన్‌కు ఖర్చు ఎక్కువ
అధికారికంగా విద్యుత్ మీటర్ కనెక్షన్ పొందాలంటే రూ.లక్షలు ఖర్చవుతుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫారమ్స్ ప్రత్యేకంగా వేయించుకోవాలంటే కెపాసిటీని బట్టి రూ.3.50 లక్షల వరకు, దూరాన్ని బట్టి ఒక్కో విద్యుత్ స్తంభానికి రూ.10 వేల వరకు ఖర్చు చేయాలి. అలాగే విద్యుత్ అధికారులు, సిబ్బందికి ము డుపులు అదనం. దీంతో చిన్న, సన్నకారు ఆక్వా రైతులతోపాటు చెరువులను లీజుకు తీసుకుని ఆక్వా సాగుచేసే రైతులు పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టలేక పక్క చెరువుల రైతుల నుంచి అక్రమంగా విద్యుత్ పొందుతూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.
వసూళ్లు ఇలా.. ఆక్వా చెరువులో ఉపయోగించే ఒక్కో ఏరియేటర్ సెట్‌కు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. ఎకరా విస్తీర్ణంలోని రొయ్యల చెరువుకు నాలుగైదు ఏరియేటర్లు వాడుతుంటారు. ఇలా నెలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఎకరా విస్తీర్ణం కలిగిన రైతు నుంచి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఐదెకరాల వరకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తూ నెలకు రూ.2.50 లక్షల వరకు ఆర్జిస్తున్నట్టు తెలిసింది.
రాయితీ మాటున వ్యాపారం
మీటర్లు లేని రైతులకు అక్రమంగా విద్యుత్ సరఫరా
సబ్సిడీని ఆసరాగా చేసుకుని రూ.లక్షల్లో ఆర్జన
విద్యుత్ సిబ్బంది కనుసన్నల్లోనే వ్యవహారం !
ఏఐ సృష్టించిన చిత్రం
అక్రమ విద్యుత్ వ్యాపారం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా భీమవరం మండలంలోని ఒక గ్రామంలో అక్రమంగా విద్యుత్ వ్యాపారం చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లగా.. విచారణ చేయగా అక్రమాలు బయటపడినట్టు తెలిసింది. అయితే నిందితుడు అధికార కూటమి పార్టీకి చెందిన నాయకుడు కావడంతో మంత్రుల స్థాయిలో అధికారులపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అలాగే జనసేన పార్టీకి చెందిన మరో నాయకుడి విద్యుత్ అక్రమాలు బయటపడటంతో అధికారులు రూ.4 లక్షలు జరిమానా విధించగా.. రాష్ట్ర మంత్రి ఒత్తిడితో రూ.80 వేలకు తగ్గించినట్టు సమాచారం. మొత్తం మీద జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అక్రమ విద్యుత్ వ్యాపారం విద్యుత్ శాఖ కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పటిష్ట నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.


