నూజివీడు: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఇన్‌చార్జి చాన్సలర్‌గా, ప్రస్తుత వైస్ చాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రెండేళ్లుగా ఇన్‌చార్జి చాన్సలర్‌గా ఉన్న ఆచార్య కొత్తా మధుమూర్తి ఈనెల 6 నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా, వర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మీనారాయణకు ఇప్పుడు ఇన్‌చార్జి చాన్సలర్ పదవిని కూడా కట్టబెట్టడంతో ఒకేసారి మూడు కీలక బాధ్యతలు అప్పగించినట్లయింది. నూజివీడు ట్రిపుల్‌ఐటీలోనే ఎన్నో సమస్యలతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలన అస్తవ్యస్తంగా మారిన తరుణంలో, మూడో బాధ్యతను కూడా ఒక్కరికే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ట్రిపుల్‌ఐటీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
పరిపాలనా వైఫల్యాలు.. ఆరోపణలు
● అక్రమ నియామకాలు: ఒంగోలు ట్రిపుల్‌ఐటీ పేరుతో 15 మందిని ఎంపిక చేసి, నిబంధనలకు విరుద్ధంగా నూజివీడులో పనిచేయించుకుంటున్నారు. ఈ నియామకాల వెనుక ఒక్కో పోస్టుకు దాదాపు రూ.3 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే ఐదుగురిని గెస్ట్ ఫ్యాకల్టీలుగా అక్రమంగా నియమించారు.
● బోధన, వసతుల నిర్లక్ష్యం: తరగతుల నిర్వహణను పట్టించుకోకపోవడం, సెక్యూరిటీ సిబ్బంది గొడవలు, అధ్యాపకుల మధ్య వర్గపోరు పెరగడం వంటి సమస్యలు నెలకొన్నాయి. కొందరే ఏళ్ల తరబడి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
● భోజన వసతి లోపాలు: మెస్‌లలో మురిగిపో యిన కోడిగుడ్లతో సహా నాసిరకం ఆహారాన్ని వడ్డిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థులను హెచ్‌ఓడీలచే బెదిరింపులకు గురిచేస్తున్నారు.
● అనుచిత బదిలీలు: శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ నుంచి అవసరం లేకపోయినా ఉద్యోగులను నూజివీడుకు బదిలీ చేశారు.
● నియామకాల ప్రక్రియపై అనుమానాలు: అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియలో తొలుత అనర్హులుగా ప్రకటించిన కొందరిని, ఆ తర్వాత అర్హు లుగా మార్చారు. ఇటువంటి వివాదాస్పద పరిస్థి తుల్లో, వీసీగా ఉన్న వ్యక్తికే ఇన్‌చార్జి చాన్సలర్ బాధ్యతలు కూడా అప్పగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు
ఇప్పటికే పాలన అస్తవ్యస్తం
వెక్కిరిస్తున్న వైఫల్యాలు
చాన్సలర్, వీసీ, డైరెక్టర్ బాధ్యతలన్నీ ఒక్కరికే?


