ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక ఈదర సుబ్బమ్మదేవి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. 18 మండలాల నుంచి 31 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యారు. ఇండియాస్ ఎనర్జీ బాస్కెట్–2047 ప్రోస్పెక్టస్ అండ్ చాలెంజెస్ అనే అంశంపై విద్యార్థులు చార్ట్‌లు, స్లైడ్స్ ఉపయోగించి ప్రదర్శన ఇచ్చారు. ప్రథమ బహుమతి ఏలూరు మండలం వంగూరుకు చెందిన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని బి.ఆశ, గైడ్ టీచర్ ఎం.నవత మార్గదర్శకత్వంలో సాధించింది. ద్వితీయ బహుమతి దెందులూరు జెడ్పీ హైస్కూల్ ప్లస్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎల్.లాస్య, గైడ్ టీచర్ కల్యాణి పర్యవేక్షణలో గెలుపొందింది. వీరిద్దరూ రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో పాల్గొంటారు. సెమినార్‌కు న్యాయ నిర్ణేతలుగా సీఆర్ రెడ్డి కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎన్‌వీవీఎస్ ప్రసాద్, ఏఆర్‌డీజీకే హైస్కూల్ టీచర్ జీవీడీ మల్లేష్‌కుమార్ వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 23 లేదా 24న విజయవాడలో జరుగుతాయని జిల్లా సైన్స్ అధికారి ఎస్‌వీఎస్ సోమయాజులు తెలిపారు. విజేతలను డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ అభినందించారు.


