● 42.70 ఎకరాలకు
దేవస్థానం నోటీసులు
● ఆందోళనలో రైతులు
ఇరగవరం : మండలంలోని రేలంగి గ్రామంలో ఉన్న శ్రీ తాలూకేశ్వర, మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలోని ఇనాం భూముల విషయంలో రైతులు, దేవస్థానం అధికారుల మధ్య వివాదం నెలకొంది. సుమారు 42.70 ఎకరాల భూములపై దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేయడం స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
సాగుదారులకు నోటీసుల షాక్
సుమారు 80 ఏళ్లుగా ఈ భూముల్లో భజంత్రీ, నౌకరి, చాకలి, కుమ్మరి, వండ్రంగి, డప్పు, మంగలి తదితర వృత్తి సేవలు చేసిన వారి వారసులు సాగు చేసుకుంటున్నారు. కొందరు క్రయవిక్రయాలు జరపగా, మరికొందరు కుమార్తెలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చారు. ఈ భూములపై బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు కూడా పొందినట్లు రైతులు చెబుతున్నారు. దశాబ్దాలుగా క్రమవిక్రయాలు జరుగుతున్న భూములను ఉన్నపళంగా దేవస్థానానివిగా పేర్కొంటూ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపించేందుకు సిద్ధమవుతున్నా, వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండానే అధికారులు చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
22–ఏ నిషేధిత జాబితాపై ప్రశ్నలు
దేవస్థాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ కొన్ని హిందూ ధార్మిక సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, 2010లోనే ఈ 42.70 ఎకరాలను 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చినట్లు రైతులు తెలిపారు. అయితే జాబితాలో చేర్చే ముందు క్షేత్రస్థాయి రికార్డులను పరిశీలించలేదని, రైతులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇన్నేళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్లపై అప్పట్లో ఎందుకు అభ్యంతరాలు తెలపలేదని, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయో సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. సర్వీస్ ఇనాం భూములను 22–ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో మళ్లీ నోటీసులు ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోందన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే చర్యలు
ఈ వ్యవహారంపై దేవస్థానం ఈఓ సూర్యనారాయణ మాట్లాడుతూ.. వివాదంలో ఉన్న 42.70 ఎకరాల భూములు దేవస్థానానికి చెందిన ఇనాం భూములేనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రైతులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.
సమగ్ర విచారణకు వినతి
రైతుల వద్ద ఉన్న ఆధారాలను, రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


