యలమంచిలి: మండలంలోని మేడపాడు గ్రామంలో సుజాత మాంటిస్సోరీ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాజ పడమర గ్రామానికి చెందిన కడలి వాసు (36) తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీపై వేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న సైకిల్ ను ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 వాహనంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకు తరలించారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కలిదిండి(కై కలూరు): అదుపుతప్పిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన కలిదిండి మండలం సంతోషపురం వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూలలంక గ్రామానికి చెందిన సాదే వెంకటేశ్వరరావు (42) ఆటో డ్రైవర్. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కలిదిండి నుంచి ఇంటికి ఆటోలో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు 108కు సమాచారం అందించగా, పరీక్షించిన సిబ్బంది ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సౌరభ్ కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడి భార్య ఉపాధి నిమిత్తం కువైట్ లో ఉంటున్నారు.
దెందులూరు: జాతీయ రహదారిపై కొమిరేపల్లి పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సింగవరం గ్రామానికి చెందిన వంజరపు ప్రసాద్ మృతి చెందాడు. చేనుకి వెళ్లేందుకు ప్రసాద్ రోడ్డుపైకి వస్తుండగా, ఏలూరు నుంచి భీమడోలు వైపు వేగంగా వెళ్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: మూర్ఛ వ్యాధి తిరగబెట్టడంతో ఓ సెల్ ఫోన్ దొంగ దొరికిపోయిన సంఘటన ద్వారకాతిరుమలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రంథాలయం సమీపంలోని వినాయకుడి ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యుడు కోపల్లి తులసి గురువారం రాత్రి నిద్రించగా, ఆయన సెల్ ఫోన్ చోరీకి గురైంది. శుక్రవారం ఉదయం శ్రీవారి కొండపై వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద కామవరపుకోటకు చెందిన ఓ వ్యక్తికి మూర్ఛ వచ్చి కిందపడిపోయాడు. ఆ సమయంలో అతడి జేబులో నుంచి కిందపడిన ఫోన్‌లో తులసి ఫొటోలను చూసిన స్థానికులు ఆయనకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న తులసి అది తన ఫోనేనని గుర్తించి నిలదీయగా, తెల్లవారుజామున తానే దొంగిలించినట్లు సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు.


