ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఆశావర్కర్ల విభాగంలో పని చేస్తున్న ఒక ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడటం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. భీమవరం పరిధిలో పనిచేస్తున్న ఒక ఆశావర్కర్ తన జీతభత్యాలు చెల్లింపులకు సంబంధించి బ్యాంకు ఖాతాలో మార్పు కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి మూడు జిల్లాల ఆశావర్కర్ల విభాగం అధికారి అనుమతి తప్పనిసరి. గతంలో భర్తతో కలిసి బ్యాంకు ఖాతా జాయింట్‌గా ఉండటం, ఇటీవల ఆమె వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో మార్పు చేసుకునేందుకు కేవైసీ అనుమతికి సదరు అధికారిని ఆశ్రయించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ అధికారి, ఆమెతో వాట్సాప్‌లో అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ మానసిక, లైంగిక వేధింపులకు గురిచేశాడు. వేధింపులు మితిమీరడంతో బాధితురాలు ఆధారాలతో సహా భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
త్రిసభ్య కమిటీ విచారణలో జాప్యం
ఈ ఘటనపై స్పందించిన ఏలూరు డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ యు. శోభ, ముగ్గురు వైద్య అధికారులతో (ఏలూరు నుంచి ఇద్దరు, భీమవరం అదనపు డీఎం అండ్ హెచ్‌ఓ)తో కూడిన విచారణ కమిటీని నియమించారు. అయితే కమిటీని ఏర్పాటు చేసి రోజులు గడుస్తున్నా నివేదికను వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి తెచ్చిన ఒత్తిళ్ల కారణంగానే విచారణ నివేదికను తొక్కిపెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వెంటనే ఈ వ్యవహారంపై స్పందించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశావర్కర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


