ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, వివిధ బందోబస్తు విధుల్లో హోంగార్డుల సేవలు ఎంతో అభినందనీ యమని జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు అన్నా రు. రెగ్యులర్ పోలీస్ సిబ్బందితో సమానంగా రెండు, మూడు దశాబ్దాల పాటు నిత్యం శ్రమిస్తూ ప్రజలకు సేవలు అందించిన ప్రతి ఒక్కరూ ఆయురారో గ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లాలో పదవీవిరమణ పొందిన హోంగార్డులను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కరించి, వారి సేవలను అధికారులు కొనియాడారు. పదవీవిరమణ పొందిన హోంగార్డులు ఎస్ సునీల్ దత్తు, కేవీవీ సత్యనారాయణ, జి.సోమశేఖర్, ఎస్ వరలక్ష్మి, బి.రమణారావులను ఏఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజా, అదనపు ఎస్పీ ప్రసాద్‌రావు కలిసి శాలువాలు కప్పి, సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నుంచి నాలుగు దశాబ్దాల పాటు నిస్వార్థంగా విధులు నిర్వర్తిస్తూ విశేష సేవలందించారని అభినందించారు. అంకితభావం, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో విధులను నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారని తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత తమ కుటుంబాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఏఆర్ ఆర్‌ఐ సతీష్‌కుమార్, ఆర్‌ఎస్సై వెంకటేష్, పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది సయ్యద్ సునయన, రిటైర్డ్ హోంగార్డుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


