కుక్కునూరు : పోలవరం ముంపు మండలాల ప్రజలకు న్యాయసేవలను చేరువ చేయాలని కోరుతూ భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తులను కలసి వినతిపత్రాలు అందజేశారు. పోలవరం జిల్లాలోని ఎటపాక, చింతూరు కేంద్రాలుగా, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు కేంద్రంగా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు న్యాయస్థానం కోసం జంగారెడ్డిగూడెంకు 90 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన 900కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నందున, కుక్కునూరు కేంద్రంగా క్యాంప్ కోర్టు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జయసూర్య, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్‌లను కలసి సమస్యలు వివరించారు. అనంతరం జస్టిస్ హరినాథ్‌ను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్ శాలువాతో సన్మానించారు.


