● కొందరికే పదేపదే అదనపు బాధ్యతలు
● నూజివీడు ట్రిపుల్‌ఐటీ అధికారుల నిర్వాకం
● విద్యావర్గాల్లో తీవ్ర చర్చ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అదనపు బాధ్యతల కేటాయింపులపై నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికోసారి మార్చాల్సిన బాధ్యతలను కొందరికే కట్టబెట్టడంపై విద్యావర్గాల్లో చర్చ సాగుతోంది.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
సాధారణంగా నిబంధనల ప్రకారం ఏడాదికోసారి అదనపు బాధ్యతలు నిర్వర్తించే వారిని మార్చాలి. కానీ, కొందరు అధికారుల ఇష్టారాజ్యంగా నిర్ణయాలతో కొందరికే పదేపదే అవకాశాలు దక్కుతున్నాయి.
ఒకే అధ్యాపకుడికి వరుస కీలక పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒక అధ్యాపకుడు ఫిబ్రవరి 2021 నుంచి అక్టోబర్ 2021 వరకు అసోసియేట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా, 2021 నవంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2022 ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు డీన్ అకాడమిక్స్‌గా, ప్రస్తుతం 2024 ఆగస్టు నుంచి ఇన్‌చార్జి ఏఓగా కొనసాగుతున్నారు. అలాగే ఇదే క్యాంపస్‌లో తెలుగు విభాగానికి చెందిన మరో అధ్యాపకుడు సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్ తదితర వ్యవహారాలకు ఫ్యాకల్టీ ఇన్‌చార్జిగా నాలుగేళ్లకు పైగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల అకాడమిక్ నష్టం
పరిపాలన, పరీక్షల నిర్వహణ వంటి పనుల్లో తలమునకలవడం వల్ల బోధనకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, ఇది విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలపై ప్రభావం చూపుతోందని ఫ్యాకల్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అనుభవానికి నోచుకోని ఇతరులు
అర్హత కలిగిన ఇతర అధ్యాపకులకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల వారికి పరిపాలనా అనుభవం దక్కకపోవడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత లోపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో పారదర్శకతను పెంచేందుకు, విమర్శలకు తావులేకుండా నిబంధనలకు అనుగుణంగా అదనపు బాధ్యతలను కేటాయించాల్సిన అవసరం ఉంది.


