ద్వారకాతిరుమల: ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్డు నిర్మాణానికి కేటాయించిన ఉపాధి హామీ పథకం నిధులు ఓ ప్రైవేట్ సంస్థ పాదసేవకు వినియోగపడటంపై తీవ్ర దుమారం రేగుతోంది. ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ లక్ష్మీనగర్ హైవే నుంచి మహాదేవపురం ఎస్సీ కాలనీ బీటీ రోడ్డు వరకు సీసీ రహదారి నిర్మాణానికి నాలుగు బిట్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ఒక బిట్ మాత్రమే మంజూరు కాగా ఇటీవల ఉపాధి నిధులు రూ.30 లక్షలతో పనులు చేపట్టారు. అయితే నిర్మాణంలో భాగంగా శ్రీనిధి ఫీడ్స్ కంపెనీ ప్రవేశ ద్వారం వరకు 360 మీటర్ల మేర డివైడర్‌తో కూడిన డబుల్ రోడ్డు నిర్మించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం కూడా నిర్మాణానికి సగం నిధులు సమకూర్చిందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజల కోసం మంజూరైన రహదారిలో ఓ ప్రైవేట్ కంపెనీ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నిర్మాణం చేపట్టడం ఏంటని మండిపడుతున్నారు.ఈ రోడ్డు కంపెనీకి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని అంటున్నారు. సదరు కంపెనీపై కూటమి పాలకులు, అధికారులకు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
పక్కా స్కెచ్‌తో..
ప్రైవేట్ కంపెనీకి రాకపోకలు సులభతరం చేసేందుకే ముందస్తు ప్రణాళికతో రహదారి డిజైన్ మార్చి పనులు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలంటే ముందుగా మంజూరైన మొదటి బిట్టును మహదేవపురం వైపు నుంచి నిర్మించి ఉండేవారని అంటున్నారు.
అందరికీ ఇదే అనువైన దారి..
మహదేవపురం పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు లక్ష్మీనగర్ హైవేపైకి చేరుకోవాలంటే ఈ మార్గమే దగ్గర. అలాంటిది ఈ పుంత రోడ్డు గుంతలమయంగా మారడంతో కొన్నేళ్లుగా వారు అటుగా రాకపోకలు సాగించడం లేదు. కొద్ది నెలల క్రితం కూటమి పాలకులు రహదారి నిర్మాణం చేపడతామని ప్రకటించడంతో వారంతా సంతోషించారు. అయితే చివరకు శ్రీనిధి ఫీడ్స్ కంపెనీ వరకు మాత్రమే రోడ్డు నిర్మించడంతో ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇది సరికాదంటూ ఫిర్యాదు
సీసీ రోడ్డు పనుల్లో నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదంటూ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులకు లక్ష్మీనగర్‌కు చెందిన వేగి విజయ్ ఫిర్యాదు చేశారు. ఈ మార్గంలో చిన్న రో డ్డుకు మధ్యలో డివైడర్ నిర్మించడం వల్ల ద్విచక్ర వా హనదారులు, ట్రాక్టర్ తదితర వాహకాల రాకపోకలకు ఇబ్బందులని పేర్కొన్నారు. అలాగే రోడ్డుకు ఇ రువైపులా డ్రైనేజీకి స్థలం లేకపోవడంతో వర్షం నీరు పొలాల నుంచి బయటకు ఎలా వెళ్లాలనే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు శ్రీనిధి ఫీడ్స్ వరకు మాత్రమే రోడ్డు, మధ్యలో డివైడర్ నిర్మించడంపై అభ్యంతరం తెలిపారు. అయితే తన ఫిర్యాదుపై అధికారులు అసంపూర్తిగా విచారణ జరిపి, క్లోజ్ చేశారని విజయ్ ఆరోపిస్తున్నారు.
అధికారుల వివరణ : దీనిపై ఇన్‌చార్జి పీఆర్‌ఏఈ సురేష్‌ను వివరణ కోరగా తాను ఇటీవలే విధుల్లో చేరానన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి సప్తగిరిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. రిటైర్డ్ పీఆర్‌ఏఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రూ.30 లక్షల నిధులతో, రూ.లక్షకు 12 మీటర్ల చొప్పున రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఒక బిట్ మాత్రమే మంజూరు కావడంతో శ్రీనిధి ఫీడ్స్ కంపెనీ వరకు మాత్రమే రోడ్డు పనులు జరిగాయని వివరించారు.
డబుల్ లైన్ రోడ్డు, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఉపాధి హామీ నిధులతో ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా పనులు చేపట్టడం సరికాదు. రోడ్డు నిజంగా ప్రజలకు ఉపయోగపడాలంటే మహదేవపురం వైపు వరకు పూర్తిస్థాయిలో నిర్మించాలి. పనుల డిజైన్ ఎందుకు మార్చారు? డివైడర్ ఎందుకు ఏర్పాటుచేశారు? దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరపాలి.
– మనెల్లి రమేష్, మహదేవపురం గ్రామస్తుడు
లక్ష్మీనగర్–మహదేవపురం సీసీ రోడ్డు నిర్మాణంలో వివాదం
రూ.30 లక్షల ఉపాధి నిధులతో పనులు
శ్రీనిధి ఫీడ్స్ కంపెనీ గేటు వరకే డివైడర్‌తో రోడ్డు
పాలకులు, అధికారులపై స్థానికుల ధ్వజం
రహదారి వివరాలు
రోడ్డు పొడవు– సుమారు 1.44 కిలోమీటర్లు
నిర్మాణ ప్రతిపాదనలు– నాలుగు బిట్లు
(ఒక్కో బిట్ 360 మీటర్లు)
ఒక్కో బిట్‌కు అయ్యే ఖర్చు రూ.30 లక్షలు
మొత్తం వ్యయం సుమారు రూ.1.20 కోట్లు
ఇప్పటివరకు మంజూరు రూ.30 లక్షలు


