మెగా డీఎస్సీకి మంగళం? | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీకి మంగళం?

Aug 15 2026 12:40 AM | Updated on Aug 15 2026 12:40 AM

మెగా డీఎస్సీకి మంగళం?

దరఖాస్తుల ఆహ్వానం

అరకొర జీతాలతో సంతృప్తి ఉండదు

కనీస వేతనం వర్తింపజేయాలి

మళ్లీ తెరపైకి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 143 పోస్టుల భర్తీకి సన్నాహాలు

నిడమర్రు: మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి స్పందనగా, నిరుద్యోగ ఉపాధ్యాయులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించింది. మరోవైపు, పాఠశాలల్లో ఖాళీల భర్తీకి గతంలో అమలైన విద్యా వలంటీర్ల తరహాలోనే అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 143 పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

జిల్లాలో 143 పోస్టులు..

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 6,534 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల అవసరముందని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు 143 పోస్టులు కేటాయించారు. ఏలూరు జిల్లాలో 11 స్కూల్‌ అసిస్టెంట్‌, 32 ఎస్జీటీ పోస్టులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 స్కూల్‌ అసిస్టెంట్‌, 92 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద (తాత్కాలిక) ప్రాతిపదికన మాత్రమే చేపట్టనున్నారు.

అరకొర గౌరవ వేతనంతో తీవ్ర నిరాశ

ప్రభుత్వం నిర్ణయించిన గౌరవ వేతనాలు అతి తక్కువగా ఉన్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్జీటీలకు రూ.10,000, స్కూల్‌ అసిస్టెంట్లకు రూ.12,500 మాత్రమే చెల్లించనున్నారు. ఎంపికై న వారు సెప్టెంబర్‌ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నియామకాలు కేవలం 2026–27 విద్యాసంవత్సరం ముగిసే వరకు (ఏప్రిల్‌ 30 వరకు, అనగా 8 నెలలు) మాత్రమే వర్తిస్తాయి. తాత్కాలిక నియామకాలు చేపట్టడంతో ఈ ఏడాది కూడా డీఎస్సీ ఉండే అవకాశం లేనట్లేనని అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఎంపిక విధానం ఇలా..

రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడతారు. అకడమిక్‌ అర్హతలకు 75 శాతం వెయిటేజీ, వృత్తిపరమైన అర్హతలకు (బీఈడీ/డీఈడీ/టెట్‌) 25% వెయిటేజీ ఇస్తారు. స్థానిక గ్రామం/మండలానికి చెందిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ టెట్‌ అర్హత ఉన్నవారు అందుబాటులో లేకపోతే ఇతర అర్హతలు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

రేపటి నుంచే దరఖాస్తులు

ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఆయా మండల ఎంఈఓ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులను పరిశీలించి, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ ఈ నెల 29న ఎంపిక జాబితాను ఖరారు చేస్తుంది. ఆగస్టు 30, 31 తేదీల్లో నియామక పత్రాలు అందజేస్తారు. ఎంపికై న వారు సెప్టెంబర్‌ 1 నుంచి బాధ్యతలు స్వీకరించాలి.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని వివిధ మండలాల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ పోస్టుల్లో నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 11 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, 32 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు వివిధ సబ్జెక్టులల వారీగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ మండలాల పరిధిలోని మండల విద్యాశాఖాధికారులకు ఈ నెల 21లోపు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలని సూచించారు. దరఖాస్తు నమూనా, అర్హతలు వంటి అంశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

బీఈడీ, టీటీసీ పూర్తి చేసి ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారికి రూ.10 వేలు, రూ.12,500 ఇవ్వడం దారుణం. అంత తక్కువ వేతనంతో అభ్యర్థులు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా బీఈడీ అభ్యర్థులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం ఇస్తున్నారు.

– కొరపాటి దివ్య, గోపీనాథపట్నం

కనీస వేతన చట్టం ప్రకారం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు గౌరవ వేతనం అందించాలి. సమగ్ర శిక్షలోని సీఆర్సీలు, ఎమ్మైఎస్‌లు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే కనీసం రూ.23,500 చెల్లిస్తేనే నిరుద్యోగులు బోధనపై పూర్తి దృష్టి సారించగలరు.

– బొర్రా గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement