మోగనున్న పెళ్లి బాజా | - | Sakshi
Sakshi News home page

మోగనున్న పెళ్లి బాజా

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

రూ. వెయ్యి కోట్లపైనే ఖర్చు

సాక్షి, భీమవరం: నెల రోజుల విరామం తర్వాత పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆషాఢ మాసం ముగిసి శ్రావణం రావడంతో శుభ ముహూర్తాలు వచ్చేశాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు నేపథ్యంలో శుభకార్యాలు చక్కబెట్టుకునే పనిలో జనం చకచక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో ఐదు వేలకు పైగా జంటలు మూడుముళ్ల బంధంతో ఏకం కానుండగా పెళ్లి ఖర్చు రూ.వెయ్యి కోట్ల పైమాటే నని అంచనా. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి ఉండటంతో మార్కెట్లు రద్దీగా మారుతున్నాయి.

జూలై 15వ తేదీన ఆషాఢ మాసం రాకతో శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. గురువారం నుంచి శ్రావణం మాసం మొదలైంది. ఈ నెల 15, 16, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 30, సెప్టెంబరు 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. సెప్టెంబరు 12 నుంచి శూన్యం మాసం ప్రారంభవుతుంది. తర్వాత కార్తీకమాసంలో ముహుర్తాలు ఉన్నాయంటున్నారు. జిల్లాలో పెళ్లి సందడి మొదలవడంతో నెలరోజులుగా ఖాళీగా ఉన్న ఫంక్షన్‌ హాళ్లు భాజా భజంత్రీలు, మేళతాళాలతో తిరిగి సందడిని సంతరించుకోనున్నాయి. అంతంతమాత్రంగా ఉన్న బంగారం, దుస్తులు, కిరాణా అమ్మకాలు జోరందుకుంటున్నాయి.

జిల్లాలోని పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో 150 వరకు ఫంక్షన్‌ హాళ్లు, 200కు పైగా కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలోని సత్యనారాయణస్వామి, కాళ్ల మండలం కాళ్లకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి, భీమవరం గునుపూడిలోని శ్రీసోమేశ్వర జనార్ధనస్వామి, పాలకొల్లులోని శ్రీరామలింగేశ్వరస్వామి, నరసాపురంలోని వేణుగోపాలస్వామి తదితర ఆలయాలు ఒకే ముహూర్తంలో ఐదు నుంచి పదికి పైగా వివాహాల నిర్వహణకు పేరొందాయి. వీటితో పాటు తక్కువ సంఖ్యలో వివాహాలు జరిగే చిన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణంలో దాదాపు 18 రోజుల్లో శుభముహుర్తాలు ఉండటంతో ఫంక్షన్‌ హాళ్లు, ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇళ్ల వద్ద ఐదు వేలకు పైనే పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఆషాఢం మొదలుకావడానికి ముందే బుకింగ్‌లతో పంక్షన్‌హాళ్లు దాదాపు హౌస్‌ ఫుల్‌ అయిపోయాయని నిర్వాహకులు అంటున్నారు. ఫొటోస్‌, వీడియో షూటింగ్‌, కేటరింగ్‌, షామియానా, భాజా భజంత్రీలు, మండపాల డెకరేషన్‌, లైటింగ్‌ తదితర వాటికి సంబంధించి ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌లు చేసేసుకున్నారు.

అంతా పెళ్లి పనుల్లోనే

శ్రావణ మాసం ముగిసిన వెంటనే భాద్రపద శూన్యమాసం, చాతుర్మాస నియమాలు రానుండటంతో కార్తీకమాసం వరకు శుభకార్యాలకు తాత్కాలిక విరామం రానుంది. మరోపక్క వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలకు ఆరు నెలలు అటు ఇటు పెళ్లిళ్లు జరపకపోవడం అనాదిగా వస్తుంది. ఈ తరుణంలో ముహూర్తాల కోసం వేచి చూస్తున్న కుటుంబాలు ఈ శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లు జరిపించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో కొంతకాలంగా వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారులు శ్రావణ మాసంపైనే గంపెడాసలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే బంగారం, వస్త్ర, కిరాణా, ఫ్యాన్సీ తదితర వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం, అన్నా చెళ్లెళ్లకు ముఖ్యమైన రాఖీ పౌర్ణమి ఉండటం, ఆషాఢ మాసం ముగియడంతో అత్తవారింటికి వెళ్లే కొత్త అళ్లుళ్లు కొనుగోళ్లతో మార్కెట్లు రద్దీ అవుతున్నాయి.

పందిరి రాట వేసింది మొదలు వివాహ తంతులు ముగిసేంత వరకు పెళ్లి ఇంట ప్రతీది ఖర్చుతో కూడుకున్నదే. పేదవర్గాల వారు ఉన్నంతలో తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని భావిస్తుంటారు. కట్నకానుకలు మినహాయిస్తే వియ్యాల వారికి కావిళ్లు, పెళ్లి శుభలేఖలు, బంగారం, దుస్తులు కొనుగోలు, కల్యాణ మండపం, లైటింగ్‌, పచ్చిపూల మండపాలు, విందుభోజనాలు తదితర వాటికి లక్షల్లో ఖర్చవుతుంది. సామాన్య, దిగువ మధ్యతరగతి వర్గాల వారు స్థానిక కమ్యూనిటీహాళ్లు, చిన్నపాటి ఫంక్షన్‌హాళ్లు, ఇంటి వద్ద పెళ్లిళ్లు కోసం రూ. మూడు లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వెచ్చిస్తుంటారు. ఎగువ మధ్యతరగతి వర్గాల్లో హల్దీ, మెహందీ, సంగీత్‌, పెళ్లి, రిసెప్షన్‌ అంటూ ఏసీ ఫంక్షన్‌హాళ్లు, థీమ్‌ డికరేషన్లు, ఫొటోషూట్‌లు, విభిన్న రకాల వంటకాలతో విందులు తదితర వాటితో రెండుమూడు రోజుల పాటు జరిపే పెళ్లి వేడుకలకు కోసం రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షలు వరకు ఖర్చుచేస్తుంటారు. సంపన్న వర్గాల డెస్టినేషన్‌ వెడ్డింగులు, స్టార్‌ హోటళ్లు, సినీ స్టార్లతో లైవ్‌ ఫెర్‌ఫార్మెన్సులు కోసం రూ.కోట్లల్లో ఖర్చుపెడతారు. ఏదిఏమైనప్పటికి సామాన్యుల నుంచి సంపన్నులు వరకు ఈ సీజన్‌లో వివాహ ఖర్చు మొత్తం రూ.1000 కోట్లుపైనే ఉంటుందని అంచనా.

మొదలైన శ్రావణమాసం

సెప్టెంబరు 7 వరకు ముహూర్తాలు

తర్వాత రెండు నెలలు మూఢం

జిల్లాలో మూడుముళ్ల బంధంతో ఏకంకానున్న జంటలు ఐదు వేలకు పైనే

రద్దీగా మారుతున్న మార్కెట్లు

పెళ్లి ఖర్చు రూ.వెయ్యి కోట్ల పైమాటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement