ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. రాష్ట్ర జూడాల అసోసియేషన్ పిలుపు మేరకు శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేసే వరకూ పోరాటం చేస్తామని జూడాలు స్పష్టం చేశారు. ప్రస్తుతం సాధారణ వైద్య సేవల విధులను బహిష్కరించామని, అత్యవసర సేవలకు సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 15 వరకూ జూడాల డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చామని తెలిపారు. అనంతరం డిమాండ్ల సాధనకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీరియర్ రెసిడెంట్ డాక్టర్ రవీంద్రకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ జూడాలకు స్టైఫండ్ 30 శాతం పెంచాలనే ప్రధాన డిమాండ్‌పై ఇంకా స్పష్టమైన హామీ రాలేదని.. ప్రభుత్వ చర్చల్లో అసోసియేషన్ నేతలు పాల్గొని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లుకు పెంచటం సరైన విధానం కాదని చెబుతున్నాని, ఈ నిర్ణయంతో కొత్త వారికి అవకాశాలు దూరం కావటం, పదోన్నతులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.


