శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్‌

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్‌ ఇరిగేషన్‌ కార్యాలయానికి మరమ్మతులు వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేయాలి మావుళ్లమ్మ ఆలయంలో చండీహోమం

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంపై బుధవారం అమావాస్య ప్రభావం కనిపించింది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఆలయ ప్రాంగణం నామమాత్రంగా వచ్చిన భక్తులతో సందడి లేకుండా కనిపించింది. దర్శన క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్‌, అనివెట్టి మండపాలు, ప్రసాదం టికెట్‌ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు స్వల్ప సంఖ్యలో భక్తులు కనిపించారు. సాధారణ రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. మధ్యాహ్నం తర్వాత ఆలయ పరిసరాలు మరింత నిర్మానుష్యంగా మారాయి.

భీమడోలు: శిథిలావస్థలో ఇరిగేషన్‌ కార్యాలయం శీర్షికన గత నెల 18న సాక్షిలో ప్రచురితమైన కథనానికి గుండుగొలను సెక్షన్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించారు. ఎట్టకేలకు ఇరిగేషన్‌ కార్యాలయానికి మరమ్మతులు చేయాలన్న ఉద్దేశ్యంతో పనులు చేపట్టారు. స్లాబ్‌ లికేజీ కాకుండా సిమెంట్‌తో నిర్మాణ పనులు చేపట్టారు. గుండుగొలను సెక్షన్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ గంథం లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.

ఏలూరు(టూటౌన్‌): జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేలు అమలు చేయాలని కోరుతూ బుధవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. పే స్కేలు అమలుతో పాటు అర్హత కలిగిన వీఆర్‌ఏలకు గ్రామ రెవెన్యూ అధికారులుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని గౌరవ వేతనంతో కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల మంది వీఆర్‌ఏలు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న నామినీలను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి న్యాయం చేయా లని వీఆర్‌ఏలు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 17, 18, 19 తేదీలలో దీక్షలు చేప ట్టేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదపండితులు చండీహోమం నిర్వహించారు. 80 మంది దంపతులు, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మీ నగేష్‌, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్‌, పాపొలు ఏడుకొండలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement