భీమడోలు: అంగన్‌వాడీ చిన్నారులకు మెరుగైన విద్య అందించడమే ’జ్ఞానజ్యోతి’ లక్ష్యమని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పి.శారద అన్నారు. భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తల మూడు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్ పీవో ఎంఎస్. రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పీడీ పి.శారద ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆటపాటలు, కథల వంటి సృజనాత్మక పద్ధతుల్లో బోధించడం ద్వారా చిన్నారుల్లో శారీరక, మానసిక పరిపక్వత, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతాయన్నారు. పీవో రాజశేఖర్ మాట్లాడుతూ ప్రీ–స్కూల్ నిర్వహణతో పాటు టీఎల్‌ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) తయారీ, బొమ్మలు, సంజ్ఞల ద్వారా బోధనా పద్ధతులను వివరిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎం జీఎస్ పద్మజ మాట్లాడుతూ.. జ్ఞానజ్యోతి శిక్షణను సద్వినియోగం చేసుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలలకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


