టి.నరసాపురం: మండలంలోని గండిగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం, గుడ్లు, చిక్కీల నిల్వ, వినియోగ వివరాల రికార్డులను నెలల తరబడి నమోదు చేయకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేయగా, అక్కడ కార్యకర్త అందుబాటులో లేకపోవడం, కేవలం హెల్పర్, కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉండడం గమనించారు. బాలింతల నమోదు రికార్డులు ఖాళీగా ఉండడాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ తనిఖీలు చేపట్టామని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
టి. నర్సాపురం: స్థానిక ఫెర్టిలైజర్ షాపు ప్రతినిధి పోలీస్ అధికారి పేరిట వచ్చిన ఫోన్ కాల్‌తో ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు. టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. టి.నరసాపురం పోలీస్ స్టేషన్ ఎస్సైగా నటిస్తూ ఒక గుర్తుతెలియని వ్యక్తి స్థానిక గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాప్ సేల్స్ మేనేజర్ పత్తిపాటి కుమార్‌బాబుకు ఫోన్ చేశాడు. అత్యవసర నిమిత్తం రూ.20 వేలు కావాలని, నగదును డ్రైవర్‌తో పంపిస్తానని, సదరు సొమ్మును యూపీఐ / క్యూఆర్ కోడ్ విధానం ద్వారా తనకు బదిలీ చేయాలని నమ్మబలికాడు. దీంతో కుమార్‌బాబు తన ఫోన్‌కు వచ్చిన క్యూఆర్ కోడ్‌కు నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత సదరు ఫోన్ నంబర్ నిలిచిపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై జయబాబు వెల్లడించారు.
దెందులూరు: రామారావుగూడెం పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన రైతు పర్వతనేని నరేంద్రబాబు పొలంలో సోమవారం రాత్రి బోరు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి కేబుల్ వైర్లు చోరీ అయినట్లు గమనించినట్లు బాధితుడు నరేంద్రబాబు తెలిపారు. సాగు అవసరాలకు ఉపయోగపడే బోరు కేబుల్ వైర్లు చోరీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు.
వేలేరుపాడు: షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు పూర్తిగా దగ్ధమై, ఓ రైతు కుటుంబం వీధిన పడిన సంఘటన చాగరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిచ్చడి దేవయ్య అనే రైతు పూరిల్లు ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిబూడిదవడంతో పాటు సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు మంగళవారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము మాట్లాడుతూ బాధితునికి ప్రభుత్వం వెంటనే పక్కా ఇల్లు మంజూరు చేయాలని, తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితునికి సీపీఐ పార్టీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆకివీడు: పెదకాపవరం గ్రామంలో రొయ్యల చెరువులో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన బాలు స్వర్గ లారే (52) సోమవారం మద్యం సేవించి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించినట్లు ఎస్సై శుభశేఖర్ మంగళవారం తెలిపారు. గత కొంతకాలంగా చెరువు వద్ద పనిచేస్తున్న లారేకు భార్య, కుమారుడు ఉన్నారు. వారు అస్సాంలోని బెట్ బరి గ్రామంలో ఉంటున్నారు. లారే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


