ఆశల సం‘పత్తి’ | - | Sakshi
Sakshi News home page

ఆశల సం‘పత్తి’

Aug 12 2026 1:10 AM | Updated on Aug 12 2026 1:10 AM

ప్రకృతి సహకరిస్తే గట్టెక్కినట్టే..

కుక్కునూరు: ఎల్‌నినో ప్రభావం, ఖరీఫ్‌ ప్రారంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో పడిన పత్తి రైతులకు ఇటీవల కురుస్తున్న అనుకూల వర్షాలు కొండంత ఊరటనిస్తున్నాయి. ఎండల తీవ్రతకు ప్రారంభంలోనే మొలకలు వాడిపోతాయేమోనని, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావని తీవ్ర ఆందోళన చెందిన రైతులకు ప్రస్తుత వర్షాలు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. మండలంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో పత్తి విత్తనాలు విత్తినంతనే ఒకటి, రెండు పలకరింపు వర్షాలు కురిశాయి. ఆ తర్వాత దీర్ఘకాలం పాటు వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ తగ్గి పత్తి మొక్కల ఎదుగుదల పూర్తిగా మందగించింది. అయితే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో పొలాల్లో తగినంత తేమ చేరి పంట రూపురేఖలు మారిపోయాయి. మొక్కలు వేగంగా ఎదుగుతూ, పలు ప్రాంతాల్లో పూత దశకు చేరుకోవడంతో చేలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో వాతావరణం అనుకూలించి, సరైన సమయంలో వర్షాలు కురిస్తే పూత, కాయ బాగా పట్టి ఆశించిన స్థాయిలో మంచి దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలతో ఊపిరి పీల్చుకుంటున్న రైతులు

పత్తి విత్తనాలు వేసి మొలకలొచ్చే దశలో వర్షాలు లేక పంట దక్కుతుందో లేదోనని చాలా భయపడ్డాం. పంట ఎదుగుదల ఆగిపోవడంతో దిగుబడిపై ఆందోళన చెందాం. అయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలు పత్తి పంటకు ప్రాణం పోశాయి. పంట ఎదుగుదల చాలా ఆశాజనకంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వాతావరణం ఇలాగే సహకరించి, పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తే పత్తి రైతు ఈ ఏడాది సంక్షోభం నుంచి గట్టెక్కినట్టే.

– మచ్చ బుచ్చిబాబు, పత్తి రైతు,

ఇసుకపాడు, కుక్కునూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement