తణుకు అర్బన్: మద్యం మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలోని మద్యం దుకాణం వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దువ్వ గ్రామానికి చెందిన తంగెళ్ల రాంబాబు అలియాస్ రాము, లోకలపు కోటేశ్వరరావు అలియాస్ శివ స్నేహితులు. రాము తాపీ పని చేస్తుండగా, శివ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు సూర్యారావుపాలెం రోడ్డులోని మద్యం దుకాణానికి వెళ్లారు. ఈ క్రమంలో పాత గొడవల నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. మాటామాట పెరిగిన తర్వాత శివ బీరు బాటిల్ పగలగొట్టి రాంబాబుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్ : వ్యాను ఢీకొని విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానిక 6వ వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న అడపా విజయ్‌కుమార్ (39) .. తన మోటారుసైకిల్‌పై మామిడితోట గాంధీబొమ్మ సెంటర్ నుంచి కొండాలమ్మ గుడి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాన్స్‌పోర్టు వ్యాను ఆయన మోటారుసైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. కిందపడిపోయిన విజయ్‌కుమార్ నడుముపై నుంచి వ్యాను చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సమీప నివాసి, 7వ వార్డు సచివాలయం అడ్మిన్ రంగనాథ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో బాధితుడిని అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు. విజయకుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాను డ్రైవరు నామిశెట్టి సత్యనారాయణను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం.


