తణుకు అర్బన్: తణుకులో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థి ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులోని వంశీ హాస్పిటల్ వెనుక వీధిలో సింహాద్రి లలిత తన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్య (18)తో కలిసి నివాసముంటోంది. లలిత ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, ఆదిత్య స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం లలిత స్నానాల గది నుంచి బయటకు వచ్చి చూసేసరికి, హాలులో ఆదిత్య ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. వెంటనే స్థానికుల సాయంతో ఆదిత్యను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాశాల అధ్యాపకులు తల్లిని తీసుకురావాలని ఆదిత్యకు పలుమార్లు చెప్పారు. ఈ విషయమై ఇంట్లో తల్లి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదిత్య ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.
చదువుల ఒత్తిడే కారణమా?
ఎంతో హుషారుగా ఉండే విద్యార్థి ముక్కుపచ్చలారని వయసులోనే ఆత్మహత్యకు పాల్పడడం బంధువులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. విద్యా ఒత్తిడి కారణంగానే ఆదిత్య బలవన్మరణానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తణుకు పట్టణ ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తణుకులో ఇంటర్ విద్యార్థి ఆదిత్య
బలవన్మరణం


