ఆకివీడు: విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. విద్యుత్ తీగ రూపంలో మృత్యువు వారి వాకిట్లోకి వచ్చింది. భార్యాభర్తల్లో ఒకరిని కబళించాలనుకుందో ఏమో.. భార్యను గాయపరుస్తూ, భర్తను అనంత లోకాలకు తీసుకుపోయింది. మండలంలోని సిద్ధాపురం గ్రామ శివారు కాళింగగూడెంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఆకాశం మేఘావృత్తమై ఉండి, ఉదయం 8 గంటల వరకూ ఈదురుగాలులు వీచాయి. అదే సమయంలో వీచిన కొద్దిపాటి ఈదురుగాలికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తెలియని అమాయకపు దంపతులు ఆ దుర్ఘటనకు బలయ్యారు. ఉదయం యథావిధిగా వాకిటిలో కల్లాపు చల్లి, ముగ్గు వేయడానికి వెళ్లిన కోమటిలంక భ్రమరాంబ అనుకోకుండా తెగిపడిన విద్యుత్ తీగను కాళ్లతో తొక్కింది. వెంటనే షాక్‌కు గురై ఆమె కేకలు వేసింది. అదే సమయంలో దగ్గరలో ఉన్న భర్త మురళి భార్యను రక్షించడానికి పరుగెత్తుకువచ్చాడు. ఆమెను విడిపించే ప్రయత్నంలో అతనూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విధి ఆడిన ఆటలో భార్యను కాపాడబోయిన మురళి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన భ్రమరాంబ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉండగా.. వారికి ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరే ఆ ఇంట్లో జీవిస్తున్నారు. బాధితురాలు భ్రమరాంబ ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాళింగగూడెం ప్రాంతంలోని కాలనీ సమీపంలో విద్యుత్ తీగలన్నీ ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యను కాపాడబోయి భర్త మృతి


