గ్రావెల్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

Aug 12 2026 1:10 AM | Updated on Aug 12 2026 1:10 AM

గ్రావెల్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

ఆగిరిపల్లి: మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో మంగళవారం క్వారీల నుంచి గ్రావెల్‌ లోడుతో వెళ్తున్న 40 లారీలను గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. తోటపల్లి, పోతవరప్పాడు క్వారీల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల్లో నెక్కలం గొల్లగూడెం మీదుగా విజయవాడకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. అధిక లోడు, మితిమీరిన వేగంతో లారీలు రాకపోకలు సాగిస్తుండటం వల్ల గ్రామంలో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలను ఇష్టానుసారంగా నడపడం వల్ల రోడ్లపైకి రావాలంటేనే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో గ్రావెల్‌ లోడుతో వస్తున్న లారీ డ్రైవర్‌ గ్రామంలోని ఒక జ్యువెలరీ దుకాణాన్ని ఢీకొట్టాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని, దుకాణం ధ్వంసమవ్వడం వల్ల రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ యజమాని ఇప్పటివరకు నష్టపరిహారంగా రూపాయి కూడా ఇవ్వకపోగా, తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. క్వారీ యజమానులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు లారీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో మూడు గంటల పాటు లారీలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement