ఎన్నికల హామీలు గాలికి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. ఆక్వా విద్యుత్ చార్జీలు తగ్గించి రైతులను ఆదుకుంటాం.. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా ప్రారంభించి పూర్తి చేస్తాం.. ఇలా లెక్కకు మించిన హామీలు గుప్పించారు. ఇక సూపర్‌సిక్స్ పేరుతో హామీలిచ్చి ఆడబిడ్డ నిధికి ఎగనామం పలికారు. ఉమ్మడి పశ్చిమకు లెక్కకు మించి హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్లు అయినా హామీల అతీగతీ లేదు. సోమ వారం కై కలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు.
కొల్లేరు సరిహద్దులు సాధ్యమేనా?
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి, ఏలూరు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లోని 77,138 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. మొత్తం 122 గ్రామాలు కొల్లేరు పరీవాహకంలో ఉన్నాయి. అభయారణ్యంలో జిరాయితీ భూములు 14,932 ఎకరాలు, డీ–పట్టా భూములు 5,510 ఎకరాలు కలిపి 20,442 ఎకరాలు ఉన్నాయి. వీటిని మినహాయించాలని ప్రభుత్వం సీఈసీని కోరింది. ఇదిలా ఉంటే ఇదిగో కొల్లేరు మిగులు భూములు ఇచ్చేస్తోన్నారు? పత్తేపురం వద్ద సొసైటీ భూములు కేటాయిస్తాం అంటూ రాజకీయ నేతలు పబ్బం గడుపుకోడానికి పదేపదే వల్లిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆధీనంలో సీఈసీ ఒకటి చెబితే దానిని ఇక్కడ కొల్లేరు ప్రజలకు మరో రకంగా నాయకులు చెబుతున్నారు. దీనిపై స్పష్టమైన హామీని సీఎం చంద్రబాబు నుంచి కొల్లేరు ప్రజలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
కంటి తుడుపు చర్యగా విద్యుత్ సబ్సిడీ
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆక్వా రంగం దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుండగా ఏలూరు జిల్లా కలిదిండి మండలం తలసరి ఆదాయంలో ఏపీలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అలాంటి ప్రాంతానికి సీఎం విచ్చేస్తున్నారు. జిల్లాలో రాయితీ విద్యుత్ కనెక్షన్లు 16,332 ఉన్నాయి. జోన్, సాగు విస్తీర్ణంతో సంబందం లేకుండా ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని, 500 ట న్నుల కెపాసీటీ కలిగిన కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్లు సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల నుంచి ఆందోళన ఎక్కువవడంతో రూ.1.50కి అందిస్తామని ప్రకటించారు. పవర్ ఫ్యాక్టర్ మెలికతో విద్యుత్ నాణ్యత 0.90 నుంచి 0.95 మధ్య ఉంటేనే రాయితీ అంటూ 169 జీఓ విడుదల చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం
హామీల అమలెప్పుడో?
కొల్లేరు సరిహద్దులు మార్పు సాధ్యమేనా?
ఆక్వా మేత ధరల తగ్గింపులో చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి
క్రాప్ హాలీడేను ప్రకటిస్తున్న ఆక్వా రైతులు
నేడు కలిదిండి మండలానికి సీఎం చంద్రబాబు రాక
సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం నిర్వాసితులకు పరిహారం, కొల్లేరు సరస్సు పరిరక్షణ అంటూ హామీలు గుప్పించారు. వీటిని అమలు చేయలేదు. కొల్లేరు సరస్సు పరిరక్షణపై నేరుగా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ శ్రద్ధ తీసుకోవడం లేదని కొల్లేరు వాసులు భావిస్తున్నారు. కొల్లేరుకు మేలు చేస్తామన్న చంద్రబాబు హామీలూ అమలు కాలేదు. ఈసారైన తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో కొల్లేరు వాసులు ఉన్నారు.


