బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిజనుల ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, భాష, యాస, కట్టుబాట్లును కాపాడుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆదివాసీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గిరిజన చట్టాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే గిరిజనులు మాత్రం వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేశారని, రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చారన్నారు. అలాగే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ గిరిజనులకు అధిక ప్రాధాన్యమిచ్చారని, సుమారు 2 లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా పథకంలో పెట్టుబడి సహాయం కూడా అందించారని గుర్తుచేశారన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులకు విద్యా, వైద్య సదుపాయాలు అందించడంలో నిర్లక్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రేషనలైజేషన్ పేరుతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఎత్తివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, ఎంపీపీ తెల్లం రమణ, జెడ్పీటీసీ మొడియం రామతులసీ, మాజీ సర్పంచ్‌లు బన్నె బుచ్చిరాజు, కూరం వెంకటేశ్వరరావు, తెల్లం వెంకాయమ్మ, మాల్చి వెంకన్నబాబు, జోడే సత్యదుర్గా ప్రసాద్, నాయకులు తెల్లం దేవరాజు, కొవ్వాసి జగదీష్, సమ్మంగి రాజశేఖర్, ఎంపీటీసీ గాలి దుర్గారావు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


