శిథిల వంతెన.. ప్రమాదమంచున! | - | Sakshi
Sakshi News home page

శిథిల వంతెన.. ప్రమాదమంచున!

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

నిధులు కేటాయించాలి డైవర్షన్‌ రోడ్డు కావాలి

కుంగిపోతున్న గుండేరు వంతెన

రెండు మండలాల రాకపోకలకు ప్రధాన వారధి

ఆందోళనలో ప్రయాణికులు

లింగపాలెం: లింగపాలెం మండలం ఆశన్నగూడెం శివారులోని గుండేరు వాగుపై ఉన్న వంతెన తీవ్ర శిథిలావస్థకు చేరి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఏళ్ల తరబడి ఈ వంతెనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వంతెన లింగపాలెం, కామవరపుకోట మండలాల మధ్య కీలక రవాణా ప్రాధాన్యం కలిగి ఉంది. నిత్యం వందలాది వాహనాలు, రైతుల వ్యవసాయ ఉత్పత్తులను మోసుకెళ్లే లారీలు, పాఠశాల బస్సులు ఇటుగా రాకపోకలు సాగిస్తాయి. అయితే, ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు 13 ఏళ్లుగా నూతన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేపట్టాలని లేదా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండు మండలాల ప్రజల రాకపోకలకు ప్రధానమైన వంతెన ఏళ్ల తరబడి శిథిలావస్థలోనే ఉంది. పంటల ఉత్పత్తులను తీసుకెళ్లాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో వంతెన మరింత కుంగిపోయింది. దీనిపై ప్రయాణించాలంటే చాలా భయమేస్తోంది. అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలి.

–మట్టా సురేష్‌, ధర్మాజీగూడెం

ప్రమాదకరంగా ఉన్న వంతెనపై ప్రయాణించాలంటే చాలా భయమేస్తోంది. నిత్యం రైతులతో పాటు చాలా మంది ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టే వరకూ ఈ ప్రాంతంలో కనీసం డైవర్షన్‌ రోడ్డు అయినా వెంటనే నిర్మించాలి.

– రెడ్డిన శ్రీను, రంగాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement