తాడేపల్లిగూడెం అర్బన్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవరపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని విమర్శించారు. జగన్ వచ్చే హెలీప్యాడ్ ప్రాంతాన్ని హైవేకు పక్కనే ఏర్పాటు చేయడం కుట్రపూరితమన్నారు. జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారని, ఆ సమయంలో పార్టీ నాయకులు, మంత్రులు కిందపడిపోయార న్నారు. తాను కూడా కింద పడిపోగా తాడేపల్లిగూడెం 23వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అఖిల్ తనను లేపడంతో మిగిలిన వారిని తాము పైకి లేవదీశామన్నారు. నేతలు, కార్యకర్తలు కిందపడిపోయేలా జనం మీదపడినా పోలీసులు నియంత్రించలేకపోయారని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల కుట్రలో భాగమేనని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ శాఖలను అనుయాయులకు అప్పగించి వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని కొట్టు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం, మామిడి, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కకుండా వ్యాపారులు, దళారులతో కూడిన సిండికేట్ దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకుండా నీరుగార్చారని ఆరోపించారు. కొందరికి మాత్రమే అరకొర సొమ్ములు అందాయని విమర్శించారు. డీఎస్సీ–25 నియామకాల్లో మెరిట్ అభ్యర్థులను పక్కనపెట్టి, అర్హత లేని వారి నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారని కొట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలు, ముఖ్యంగా జెన్‌జీ తరానికి చెందిన యువత నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. నాయకులు కర్రి భాస్కరరావు, చెన్నా జనార్దన్, ముప్పిడి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ


