మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్
బుట్టాయగూడెం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పర్యటన సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. బుట్టాయగూడెం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు దేవరపల్లి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. అక్కడికి వచ్చిన రైతులను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ అవమానకరంగా మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వారిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రైతుల సమస్యలపై స్పందించకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం అధికార పార్టీ నాయకుల దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలుగా రైతులను గౌరవించడం వారి బాధ్యత అనే విషయాన్ని గుర్తించుకోవాలని, వెంటనే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, జీలుగుమిల్లి మండల కన్వీనర్ చందా ప్రసాద్, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, బోదా శ్రీనివాసరెడ్డి, బూరుగు ప్రేమ్‌కుమార్, చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సోమగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


