మళ్లీ తప్పించుకున్న పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తప్పించుకున్న పెద్దపులి

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

బుట్టాయగూడెం: గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి గురువారం కూడా వారికి చిక్కకుండా తప్పించుకుంది. పులిని బంధించేందుకు సుమారు 400 మందికి పైగా సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ, అది దొరకకుండా తిరుగుతూ చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ పులి జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా పెద్దపులి ఏ ఒక్క పశువుపై దాడి చేసిన సంఘటన జరగలేదు. అయినప్పటికీ, పులి ప్రస్తుతం మంచి ఆకలితో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి 10 గంటల వరకు పులిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అది తప్పించుకు తిరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే తెలంగాణ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రికి పెద్దపులి తెలంగాణ వైపు వెళ్తుందా, లేక మళ్లీ గుబ్బల మంగమ్మ గుడి వైపు వెళ్తుందా అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అనువైన ప్రదేశాల్లోనే పులి సంచరించినప్పటికీ, అటవీశాఖ అధికారుల వ్యూహాలను తిప్పికొడుతూ తప్పించుకు తిరుగుతోంది. ఒకవేళ పులి అటు తెలంగాణ వైపు వెళ్లినా, ఇటు గుబ్బల మంగమ్మ గుడి వైపు వచ్చినా అక్కడ దట్టమైన కొండలు, గుట్టలు, అడవి ఉండటంతో ఈ పరిస్థితుల్లో దానిని పట్టుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. పులిని బంధించే ప్రయత్నాల్లో జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌ రెడ్డి, రాజమండ్రి సీసీఎఫ్‌ టి.జ్యోతి, జంగారెడ్డిగూడెం, కన్నాపురం రేంజ్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement