న్యూస్‌రీల్
న్యాయం జరిగే వరకు పోరాటం
బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: యువతరం గళమెత్తింది. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరుబాట ఉధృతమైంది. బాధిత అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఈ పోరుబాటకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన పార్టీ నేతలు, మలివిడతగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువత, డీఎస్సీ అభ్యర్థులు, రిటైర్డ్ టీచర్లు ఇలా అన్ని వర్గాలను కలుపుకుని రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ సమావేశాల్లో అక్రమాలను ఎలుగెత్తి చాటారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అర్హత ఉన్న ప్రతి బాధిత అభ్యర్థికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోరుబాటను నిర్వహించారు.
నిరుద్యోగుల భవిష్యత్‌తో ఆటలొద్దు
కై కలూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన సమావేశానికి యువత, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యాయి. నిరుద్యోగుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే రాష్ట్రంలో మరో ‘జెన్‌జీ’ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు నేతృత్వంలో సోమవారం జంగారెడ్డిగూడెం, మంగళవారం చింతలపూడి మండలాల్లో సదస్సులు నిర్వహించారు.
డీఎస్సీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. అలాగే ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సదస్సు నిర్వహించి, డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అభ్యర్థులు నష్టపోయిన వైనంపై చర్చించారు. దెందులూరు నియోజకవర్గ పార్టీ నేతల ఆధ్వర్యంలోనూ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం అవినీతికి పాల్పడటంపై సర్వత్రా మండిపడ్డారు.
డీఎస్సీ–2025పై సమరభేరి
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో రౌండ్‌టేబుల్ సమావేశాలు
హాజరైన యువత, డీఎస్సీ అభ్యర్థులు
మంత్రి పదవికి నారా లోకేష్ అనర్హుడంటూ మండిపాటు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్
బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుందని నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులు, యువత, డీఎస్సీ అభ్యర్థులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏలూరు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండలంలో పార్టీ సమన్వయకర్త తెల్లం బాలరాజు నేతృత్వంలో రౌండ్‌టేబుల్ సదస్సు నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, భృతి హామీలను విస్మరించిన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


