తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం: వికసిత్ భారత్‌ను నిర్మించేందుకు తయారీ రంగంలోని అవకాశాలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐ–ల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఎనిమిదో స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు లోకజ్ఞానాన్ని అందించి, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల ఎదుగుదలలో గురువుల భాగస్వామ్యం ఎప్పటికీ మరవలేనిదని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థీ తాను ఎంచుకున్న రంగంలో పరిణతి సాధించాలని, కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్న ఈ డిజిటల్ యుగంలో వాటిపై పట్టు సాధిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని శ్రీనివాసరాజు సూచించారు.
యువ ఇంజనీర్ల పాత్ర కీలకం: ఐఐటీ తిరుపతి డైరెక్టర్
గెస్ట్ ఆఫ్ హానర్‌గా హాజరైన ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కె.ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ... విద్యార్థుల క్రమశిక్షణ, జిజ్ఞాస, పట్టుదలకు స్నాతకోత్సవ సర్టిఫికెట్ నిదర్శనమని అన్నారు. విద్యార్థులు జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిన ఆయన, విజయవంతమైన జీవితానికి ఐదు ముఖ్య సూత్రాలను వివరించారు.
నిట్ ప్రగతి నివేదిక వెల్లడి
నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు మాట్లాడుతూ.. విద్యార్థుల కఠిన శ్రమ, తల్లిదండ్రుల త్యాగం, అధ్యాపకుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. ఈ స్నాతకోత్సవంలో 644 మందికి బీటెక్, 53 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిట్ సంస్థల శ్రేణీకరణలో సంస్థ ఉన్నత ర్యాంకులు సాధించిందని తెలిపారు. వేడుకలో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఎనిమిది మందికి, అలాగే ఆల్‌రౌండ్ ప్రతిభ ప్రదర్శించిన సమయమంతుల అవ్యక్తకు ఇన్‌స్టిట్యూట్ తరఫున రెండు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిట్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నిట్ స్నాతకోత్సవంలో వక్తలు


