ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాధారణం కన్నా 34 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని, సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే రైతులకు 66,293 పీఎండీఎస్ కిట్లు అందించగా, అదనంగా మరో 35 వేల కిట్లు పంపిణీ చేయాలని, సబ్సిడీపై విత్తనాలు అందించాలని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా డెల్టాలలో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, శివారు ప్రాంతాలకూ తాగునీరు అందేలా చూడాలని సూచించారు. ఇళ్లు మంజూరై తీసుకోకుండా తాత్సారం చేసే వారి కేటాయింపులను రద్దు చేసి అర్హులకు ఇవ్వడంతో పాటు నిర్లక్ష్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఏలూరు నగరంలో రోడ్లపై చెత్త, డ్రెయిన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, 22–ఏ వివాదాస్పద భూముల సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతులపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో 86 వేల ఎకరాల్లో 1.26 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ‘రైతు సంపద’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు రూ.1.20 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని కలెక్టర్ తెలిపారు. ఏలూరు డీసీఎంఎస్‌లో నిర్వహించిన ప్రత్యేక విక్రయాల్లో రూ.38 లక్షల వరకు అమ్మకాలు జరగడాన్ని మంత్రి అభినందించారు. ఈ ఉత్పత్తుల విక్రయాలను బస్సు స్టేషన్లు, మండల స్థాయికి విస్తరించాలని సూచించారు.
ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్


