ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ, దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 10వ తేదీన జిల్లావ్యాప్తంగా ‘జైల్ భరో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఏలూరులోని ఉద్ధ రాజు రామం భవనంలో ‘జైల్ భరో’ పోస్టర్లు, కరపత్రాలను వివిధ ప్రజా సంఘాల నాయకులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 9 క్విట్ ఇండియా స్ఫూర్తిని గుర్తుచేస్తూ దేశ సార్వభౌమాధికారం, లౌకికత్వాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ జైల్ భరో పోరాటాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు.


