అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : విధి నిర్వహణలో అంకితభావం చూపించి, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలుచేసే అధికారులకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు అధికారులకు ఆమె బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డులను అందజేసి, జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అవార్డులు పొందిన వారిలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు ఆర్డీఓ కే. లక్ష్మీప్రసన్న, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణతో పాటు తహసీల్దార్లు బి. రమాదేవి (భీమడోలు), జి. స్వాతి (చాట్రాయి), ఎం. సన్యాసిరావు (ఉంగుటూరు), షేక్‌ షంషుద్దీన్‌ (నూజివీడు), లింగపాలెం డిప్యూటీ తహసీల్దార్‌ స్రవంతి ఉన్నారు.

సంతృప్త్త స్థాయిని మరింత పెంచాలి

అనంతరం గోదావరి సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచాలని ఆదేశించారు. రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల అర్జీలకు వివాదరహితంగా శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు, ఇంటి పట్టాలను అర్హులకు త్వరితగతిన అందించాలన్నారు.

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

మరో సమీక్షా సమావేశంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని, న్యాయపరమైన సమస్యలు ఉంటే రైతులతో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాలలో జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌.శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి, విజిలెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌.దేవకీదేవి, ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి ఎం.ముక్కంటి, పులిచింతల ఎస్‌ఈ జి. రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement