యథేచ్ఛగా మట్టి తోలకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి తోలకాలు

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

యథేచ్ఛగా మట్టి తోలకాలు విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీ నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు

కొయ్యలగూడెం: మండల పరిధిలోని యర్రంపేట, రాజవరం గ్రామాల మధ్య ఉన్న సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు జేసీబీలు, టిప్పర్లను వినియోగిస్తూ రేయింబవళ్లు మట్టిని తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలను నిరోధించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ టిప్పర్ల రాకపోకలతో గ్రామాల్లోని అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ప్రజలు వాపోతున్నారు. అలాగే పంట పొలాలకు నీరందించే కాలువ బోదెలపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించడంతో అవి దెబ్బతిని సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చెరువుల్లో సాగుతున్న అక్రమ మట్టి తరలింపును అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

లింగపాలెం : రబీ సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో మండలంలోని ధర్మాజీగూడెం గ్రామంలో ఉన్న విత్తనాల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్‌ బాషా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని మినుము, జొన్న విత్తన నమూనాలను సేకరించి, నాణ్యతా పరీక్షల నిమిత్తం ప్రాంతీయ కోడింగ్‌ సెంటర్లకు పంపాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చింతలపూడి వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) వై. సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారి (ఏఓ) వి. ప్రదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు వెస్ట్‌ గోదావరి డిస్ట్రిక్ట్‌ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయరాజు, శ్యాప్‌ కోచ్‌ జయలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌, డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మంది ఆర్చర్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాలకు సీనియర్‌ ఇండియన్‌ రౌండ్‌, కాంపౌండ్‌, రికర్వ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement