శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఐక్యంగా పోరాడితేనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు స్పష్టం చేశారు. స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాలులో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అధ్యక్షతన శనివారం నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి బహుజనులు ఐక్యంగా ఉండాలని, భావితరాల భవిష్యత్తు కోసం పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి రాజకీయంగా ఎదగాలని, అంబేడ్కర్ రాజ్యాంగం అందించిన ఫలాలను అందుకోవాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ దళిత, బహుజనులకు రావాల్సిన నిధులను ఖర్చు చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఈ సదస్సు ప్రారంభంలో మహాత్మా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, కాన్షీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు నేతల రమేష్ బాబు సభా పరిచయం చేయగా.. నూకపెయ్యి సుధీర్, పల్లెం ప్రసాద్, బిషప్ కారుపాటి శాంతిసాగర్, రియాజ్ ఆలీఖాన్, మున్నుల జాన్ గురునాథ్, కాపుదాసి రవి తదితరులు పాల్గొన్నారు.


