పనులు నిల్‌.. బిల్లులు ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

పనులు నిల్‌.. బిల్లులు ఫుల్‌

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

పనులు నిల్‌.. బిల్లులు ఫుల్‌ నకిలీ బిల్లులు పొందిన ఘటనలు ఇలా

● టూటౌన్‌లోని ఎన్టీఆర్‌ పార్కులో జిమ్‌ పరికరాల మరమ్మతుల పేరిట రూ.4.92 లక్షలు

● పోణంగి కంపోస్టు యార్డులో డోజర్‌ రిపేర్‌ పేరిట రూ. 4.80 లక్షలు

● శ్రీ సాయి ఏజెన్సీస్‌ నిర్వహించిన పనులకు రూ. 5.36 కోట్లు

● పి. రాకేష్‌ అనే కాంట్రాక్టర్‌ పేరుతో రూ. 2.67 కోట్లు

● ఆదిత్య ఇంజనీరింగ్‌ పేరుతో రూ. 1.50 కోట్లు చొప్పున బిల్లులు చెల్లించారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ అక్రమాలకు, నిధుల మళ్లింపునకు వేదికగా మారింది. చేయని పనులకు బిల్లులు చేసుకోవడం, సంబంధం లేని శాఖల్లో పనులు చేసినట్లు చూపించడం, నామమాత్రపు పనులకు భారీగా నిధులు కాజేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. గడిచిన రెండేళ్ల వ్యవధిలోనే సుమారు 800 పనులను నామినేషన్‌ పద్ధతిలో కేటాయించి, రూ. 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కోట్లాది రూపాయలు కాగితాలపై ఖర్చవుతున్నా నగరంలో మాత్రం ఏమాత్రం అభివృద్ధి కనిపించడం లేదు. అధికార పార్టీ నాయకులు, వారి బినామీ కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఈ పనుల పందారం సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరుపుతుండగా, తాజాగా ఏసీబీ కూడా దృష్టి సారించింది.

బినామీలకే రూ.12 కోట్ల లబ్ధి

జీవో నంబర్‌ 255 ప్రకారం రూ.5 లక్షల లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్‌ ప్రాతిపదికన కేటాయించాలి. రూ.5 లక్షలు దాటితే తప్పనిసరిగా టెండర్లు పిలవాలి. అలాగే నామినేషన్‌ పనులను గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక సంఘాలు లేదా సంక్షేమ సంఘాలకు అప్పగించాలి. అయితే అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 280 పనులకు గాను రూ. 12.58 కోట్లు, 2025–26 ఆర్థిక సంవత్సరం: 520 పనులకు గాను రూ. 18.21 కోట్లు ఇలా మొత్తం 800 పనులను నామినేషన్‌ పద్ధతిలోనే కట్టబెట్టారు. నిజానికి వీటిలో కేవలం 200 లోపు పనులకు మాత్రమే నామినేషన్‌ అర్హత ఉంది. మిగిలిన పనులన్నింటికీ టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికీ, అధికారుల సహకారంతో నిబంధనలు ఉల్లంఘించారు. ఈ ప్రక్రియలో బడా నాయకుల బినామీలు రూ.12 కోట్ల మేర లబ్ధి పొందినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి.

ప్రైవేటు వెంచర్లు, వస్తువులకు కార్పొరేషన్‌ నిధులు

మాజీ మేయర్‌ భర్తకు చెందిన ఎస్‌ఎంఆర్‌ నగర్‌ ప్రైవేటు వెంచర్‌లో రూ. 4.25 కోట్లతో 62 పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించి పూర్తి చేయడం గమనార్హం. వాస్తవానికి డీటీసీపీ నిబంధనల ప్రకారం వెంచర్‌ యజమానే స్వంత ఖర్చులతో రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు అభివృద్ధి చేయాలి. కానీ కార్పొరేషన్‌ నిధులతో ఈ వెంచర్‌ను తీర్చిదిద్దారు.

మెప్పు కోసం స్పెషల్‌ వర్క్స్‌

కార్పొరేషన్‌కు సంబంధం లేని ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలోని పనులకు కూడా నిధులు మళ్లించారు. డీఎస్పీ కార్యాలయంలో రూ.5.80 లక్షలతో నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలోని ఇండోర్‌ స్టేడియంలో క్రికెట్‌ ప్లాట్‌ఫామ్‌ కోసం రూ. 4.98 లక్షలు, గేటు, నెట్‌, ఫ్లోర్‌ మ్యాట్‌ మరమ్మతుల కోసం రూ. 3.29 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేసుకున్నారు.

ఏలూరు కార్పొరేషన్‌లో ‘నామినేషన్‌’ దోపిడీ !

రెండేళ్లలో రూ.30 కోట్లతో 800 పనులు

బడాబాబు బినామీ కాంట్రాక్టర్లు ముగ్గురికే అధికంగా పనులు

నిబంధనలకు తిలోదకాలు

డీఎస్‌డీఓ, ఆర్‌అండ్‌బీ పనులకు కూడా నగరపాలక సంస్థలో బిల్లులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement