పెనుగొండ: నక్కల డ్రెయిన్‌ను అక్రమ మట్టి మాఫియా కోరల నుంచి పరిరక్షించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు డిమాండ్ చేశారు. ఆచంట వేమవరంలో అక్రమ మట్టి తవ్వకాలపై సర్పంచ్ జక్కంశెట్టి చంటి, పలువురు నాయకులు, రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం సాయంత్రం మట్టి తవ్వక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ గతేడాది ఇదే ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారన్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి రామానాయుడుకు సమాచారం ఇచ్చామన్నారు. అక్రమ తవ్వకాలపై రాజకీయం చేయడం కాదని, కేవలం రైతులను దృష్టిలో పెట్టుకునే పరిశీలనకు వచ్చామన్నారు. నక్కల డ్రెయిన్ వలన వర్షాకాలంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గంలోని వందలాది ఎకరాలు ముంపు భారీన పడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ తరుణంలో నక్కల డ్రెయిన్ గట్టులనుతవ్వడం వల్ల మరింత ముంపు ప్రమాదం ఉంటుందన్నారు. ఈ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆచంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనరు జక్కంశెట్టి శ్రీరామ్, సీనీయర్ నాయకులు సుంకర సీతారామ్, ముత్యాల నాగేశ్వరరావు, కోటే శశిమధు, పిల్లిరుద్ర ప్రసాద్, దొమ్మేటి రాంబాబు, కుక్కల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


