ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాఽథ్ గురువారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు, పండితులు న్యాయమూర్తికి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆలయ ఏఈఓ ఎం.దుర్గారావు తదితరులున్నారు.
ఏలూరు టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో పోలీస్ శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. మహిళ పోలీస్‌స్టేసన్‌లో విద్యార్థినులకు ప్రత్యేకంగా పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. మహిళ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర పర్యవేక్షణలో ఎస్‌ఐ నాగమణి, పోలీస్ సిబ్బంది ఓపెన్ హౌస్‌లో పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలను చూపిస్తూ వివరించారు. మహిళ పోలీస్ స్టేషన్‌లో బాధితులకు మనోధైర్యాన్ని కల్పించే కౌన్సెలింగ్ రూంను విద్యార్థినిలకు చూపించారు. కుటుంబ సమస్యలు, వేధింపుల నేపథ్యంలో సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో డీఎస్పీ రవిచంద్ర వివరించారు.
పోలవరం రూరల్ : ఎంపీపీ, ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ఏలూరు జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు సుంకర వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మేకల హనుమంతరావు ఆధ్వర్యంలో 26 జిల్లాల నుంచి ఎంపీపీలు సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో శుక్రవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన జువాలజీ, ఎకనామిక్స్ –2 పరీక్షలకు మొత్తం 7,806 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్ విద్యార్థులు 6,156 మందికి 5,945 మంది హాజరు కాగా 211 మంది గైర్హాజరయ్యారు. 1,997 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,861 మంది హాజరుకాగా 136 మంది గైర్హాజరయ్యారు.
ఏలూరు (టూటౌన్) : ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు గాంధీనగర్ అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కోకో సాగు చేసే అన్ని జిల్లాల నుంచి కోకో రైతుల సంఘం ప్రతినిధులు పాల్గొనవలసిందిగా కోరారు.


