అమలు కాని హామీలు
గత కొన్ని నెలలుగా కోకో ధర దిగజారిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ధర పలికింది. ఇప్పుడు కిలో రూ.260 నుంచి రూ.350 వరకు దిగజారింది. రైతులు ఎరువుల ఖర్చుతోపాటు కూలీల ఖర్చు అధికమవడం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గి నష్టపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలా చర్య తీసుకోవాలి.
– సాయిన కనకరాజు, రైతు, కామవరపుకోట
కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నాం. ఎరువుల ఖర్చుతో పాటు కూలీల ఖర్చు అధికమవుతుంది, గతంలో కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు పలికింది. ఈ ఏడాది కిలో రూ.320కు దిగజారింది. దీంతో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు కిలో రూ.900 గిట్టుబాటు ధర కల్పించి, గింజలను వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోకో ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. గత నాలుగేళ్ళలో ఎన్నడూ లేని విధంగా కిలో కోకో ధర రూ.260 నుంచి రూ.300కు చేరింది. గతంలో రికార్డు స్థాయిలో ధరలు రావడంతో లక్షలకు కౌలు ధర చేరడం, పెట్టుబడులు గణనీయంగా పెరిగినా ఆశాజనకమైన ధరతో రైతుకు కొంతమేర గిట్టుబాటు అయిన పరిస్ధితి. ఈ ఏడాది మాత్రం పూర్తి భిన్నంగా భారీగా పతనం కావడంతో కనీసం కౌలు ధర కూడా దక్కని స్థితికి కోకో రైతులు చేరారు.
దేశంలో ఏపీ కోకో సాగులో మొదటి స్థానంలో ఉంటే రాష్ట్రంతో పాటు దేశంలో ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉంది. 46 వేల ఎకరాల్లో ఈ ఏడాది కోకో సాగు చేశారు. 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా కాగా జనవరి నుంచి కోకో సీజన్ ప్రారంభమై ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల పాటు కోకో పంటకు కీలకం. నాణ్యమైన గింజ కూడా ఈ సీజన్‌లోనే లభ్యమవుతుంది. గతేడాది అంతర్జాతీయ మార్కెట్‌లో నిల్వలు ఉండటం, ప్రపంచ వ్యాప్తంగా కోకోకు కొంత డిమాండ్ తగ్గడంతో సీజన్ ప్రారంభమై కిలో రూ.550 అంతర్జాతీయ ధరకు ప్రారంభమైంది. స్థానికంగా ఉన్న మూడు కోకో కొనుగోలు కంపెనీలు సిండికేటై కిలో రూ.100 మేర తగ్గించి కొనుగోలు చేస్తున్నాయి. జనవరిలో అంతర్జాతీయ ధర రూ.500 నుంచి రూ.550 ఉంటే స్థానికంగా ధర రూ.400, ఫిబ్రవరిలో రూ.350 స్థానిక ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఈ నెల మరింత పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ రూ.300 ఉంటే రూ.250 నుంచి రూ.280కి కొనుగోలు చేస్తున్నారు. కోకో సాగుదారులు ఈ తరహా సంక్షోభం గతంలో ఎన్నడూ చూడలేదు. గతేడాది సీజన్ ప్రారంభంలో కిలో ధర రూ.750తో ప్రారంభమై స్థానిక మార్కెట్‌లో మార్చికి రూ.500 నుంచి రూ.550గా ఉంది. ఏప్రిల్‌లో మరో వంద తగ్గి రూ.400కు కంపెనీలు కొనుగోలు చేసిన క్రమంలో రైతులు ఉద్యమబాట పట్టడంతో ప్రభుత్వం కిలోకు రూ.50 ధర చెల్లించి మే 15 నుంచి జూన్ వరకు కొనుగోలు చేసింది.
గతేడాది కోకో రైతులు ముట్టడి, నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగించడంతో పలు దఫాల చర్చల అనంతరం రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్‌ఫెడ్ తరహాలో కోకో గింజల కొనుగోలు పాలసీని నిర్ణయిస్తామని, ధరను నిర్ణయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనిపై ఏడాది దాటినా ఎలాంటి కదలిక లేదు. ఈ ఏడాది జనవరిలో కోకో కాంక్లేవ్‌ను రాష్ట్ర ఉద్యానవన శాఖాధికారులు పెద్ద ఎత్తున నిర్వహించి కోకో సాగు సూచనలు మొదలుకొని యంత్ర పరికరాల వినియోగం, కంపెనీల కొనుగోలుకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలు కోకో సాగు విస్తీర్ణం పెంపొందించేలా రెండు రోజులు పాటు సదస్సు నిర్వహించారు. అయితే హామలు అమలు చేయలేదు. మరో 3 నెలల పాటు సీజన్ కొనసాగునున్న నేపధ్యంలో ధరలు మరింత పతనమవుతాయనే ఆందోళన సర్వత్రా కొనసాగుతుంది.
గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ ధర
సీజన్ సమయంలో కిలో రూ.260 నుంచి రూ.300కు కొనుగోలు
గత ప్రభుత్వ హయాంలో రూ.900 పలికిన ధర
వ్యాపారుల సిండికేట్‌తో స్థానికంగా ధర పతనం


