సాక్షి, భీమవరం: కులాల కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయడం, హిందూ దేవాలయాలు, ప్రసాదాలపై విషం చిమ్మి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు మేలు చేయాలని, లేదంటే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామిని శుక్రవారం రోజా దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. అసెంబ్లీకి రావడం లేదంటూ ఆరోపిస్తున్న కూటమి నేతలు అసెంబ్లీ, మండలికి వైఎస్సార్‌సీ సభ్యులు హాజరైతే ఏవిధంగా వ్యవహరిస్తున్నారో అంతా చూస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని చెప్పారు. వాగ్దానాలు, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోగా రాజకీయ స్వలాభం కోసం హిందూ ఆలయాలు, ప్రసాదాలపై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ హిందువు కూడా స్వామివారిని, ప్రసాదాన్ని దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగి భక్తుల మనోభావాలను దెబ్బతీయరని చెప్పారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంల తీరు చూస్తుంటే వారు హిందువులేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక ద్వారా సుప్రీంకోర్టు నిర్ధారించి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పినా సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి దిగజారి మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. శాసనమండలిలో చర్చను పక్కదారి పట్టించేందుకు చివరికి మండలి చైర్మన్ కులం, మతం గురించి ప్రస్తావన చేసే స్థాయికి కూటమి దిగజారడం దురదృష్టకరమని రోజా అన్నారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు పెద్ద మనసుతో క్షమించినా, రాష్ట్రంలోని దళితులు, క్రిస్టియన్లు, పేదలు కూటమి నేతలను క్షమించరన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది చూడాలి తప్ప కులాలు, మతాలను కాదన్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెంనాయుడు గాడిద లాగా అడ్డంగా పెరిగారే గానీ ఏ రోజూ సక్రమంగా మాట్లాడింది లేదని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు చర్చకు రావాలేగానీ చైర్మన్ మత ప్రస్తావన ఎందుకు తేవాలని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా స్పష్టం చేశారు.
అభివృద్ధిని విస్మరించిన కూటమి
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తీరు చూస్తుంటే హిందువులేనా అనే అనుమానం కలుగుతోంది
భీమవరంలో మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శలు


