ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మినిమం టైమ్ స్కేల్ ప్రాతిపదికన పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ నెల జీతాలు ఇంతవరకూ విడుదల చేయకపోవడం దారుణమని, వెంటనే వారికి జీతాలు చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట ఎడ్వర్డ్ కోరారు. ఈ మేరకు అసోసియేషన నాయకులు ఫ్యాప్టో నాయకులతో కలిసి శుక్రవారం డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయుల పూర్తి వివరాలను తక్షణమే సేకరించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పంపించి వారిని నిధి పేరోల్‌లో చేర్చి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ మోహన్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఇంతవరకు నిధి పేరోల్ వ్యవస్థలో నమోదు కాకపోవడం వలన వారి జీతాలు ఆలస్యమవుతున్నాయని, దీనివల్ల ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంటీఎస్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు బీ రాంబాబు, ఎం.రవి కిషోర్, వీవీ భూషణ్ రాజు, కరుణానిధి, కే.స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.


