ద్వారకాతిరుమల: మండలంలోని పలు గ్రామాల్లో మట్టి అక్రమ తవ్వకాలు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం ఐఎస్ జగన్నాథపురంలోని ఎర్ర చెరువులో, గుణ్ణంపల్లి పంచాయతీ తక్కెళ్లపాడులోని తాడిపూడి–పోలవరం కాలువ గట్లపై మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి. ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి బయటకు తరలిపోయింది. తరలించిన మట్టిని ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేసి, రాత్రి వేళల్లో వాటిని ఇతర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. తక్కెళ్లపాడులో గత కొద్ది రోజులుగా ఈ మట్టి దందా బహిరంగంగా సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా చెరువులను ఇష్టానుసారం తవ్వుతున్నారు. కాలువ గట్లను మాయం చేస్తున్నారు.


